ఈ కాసులు పిండుకోవటం ఏంటి పుష్పా?
ఈ తీరుకు సగటు కార్మికుడు మొదలుకొని కంపెనీ సీఈవో వరకు మినహాయింపులు ఉండవు
By: Tupaki Desk | 1 Dec 2024 6:37 AM GMTఅభిమాన హీరో సినిమా వస్తుదంటే.. వ్యక్తిగత పనుల్ని సైతం పక్కన పడేసి.. ముందు వెండితెర మీద అభిమాన నటుడి సినిమా చూడటానికి మించిన పనేం ఉండదన్నట్లుగా వ్యవహరించటం తెలుగు వారికి ఉన్న బలహీనత. ఈ తీరుకు సగటు కార్మికుడు మొదలుకొని కంపెనీ సీఈవో వరకు మినహాయింపులు ఉండవు. మిగిలిన విషయాల్లో ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించే వారు సైతం అభిమాన హీరో సినిమా విషయంలోనూ.. క్రేజీ మూవీ విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించటం కామన్ గా కనిపిస్తూ ఉంటుంది.
ఈ తీరును నిర్మాతలు క్యాష్ చేసుకోవాలనుకోవటంపై ఆగ్రహాం వ్యక్తమవుతోంది. ఏళ్లుగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న పుష్ప2 ది రూల్ చిత్రం టికెట్ ధరల పెంపు అంశం అభిమానులకు షాక్ కు గురి చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల ఐదున సినిమా విడుదల కానుంది. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన బెనిఫిట్ షో కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
డిసెంబరు 4 రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి బెన్ ఫిట్ షోను ప్రదర్శించేందుకు వీలుగా అనుమతులు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ బెన్ ఫిట్ షో ను ప్రదర్శించే అన్ని రకాల స్క్రీన్లలో టికెట్ ధరను రూ.800 పెంచుకోవటానికి ఓకే చెప్పటం అభిమానులకు షాకింగ్ గా మారింది. సాధారణంగా పెద్ద సినిమాలు.. క్రేజీ సినిమాల్ని విడుదల చేసే వేళలో.. పరిమిత థియేటర్లలో మహా అయితే.. వేళ్ల మీద లెక్కించేలా కొన్ని థియేటర్లకు పర్మిషన్ ఇస్తారు.
అందులోనూ ఆ షోను సెకండ్ షో అయిపోయిన తర్వాత అంటే అర్థరాత్రి వేళలో ఈ షోను వేస్తారు. దీన్ని ఫ్యాన్స్ షోగా పేర్కొంటారు. ఈ షోకు అమ్మే టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికి.. ఆ షో తర్వాత నుంచి మాత్రం టికెట్ ధరలు మామూలుకంటే కాస్త ఎక్కువగా ఉండటం కామన్. పుష్ప 2 విషయానికి వస్తే.. రాత్రి తొమ్మిదిన్నర గంటలనుంచి వేసే షోలకు టికెట్ ధరల్ని భారీగా పెంచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించటంతో.. పెద్ద ఎత్తున స్క్రీన్లలో ఈ షోను వేసే వీలుందని చెబుతున్నారు.
ఐదో తేదీ ఉదయం ఆరున్నర గంటలకు పడే షోకు ముందు.. దాదాపు రెండు షోలు పడతాయని చెబుతున్నారు. నాలుగో తేదీ రాత్రి తొమ్మిదిన్నరకు మొదటి షో.. తర్వాత ఒంటి గంట తర్వాత రెండో షో పడుతుందని.. ఐదో తారీఖు తెల్లవారుజామున వేసేది మూడో షో అంటున్నారు. తమ అభిమాన నటుడి సినిమాను మొదటి షో.. లేదంటే రెండో షోను మిస్ కాకుండా చూడాలనుకోవటం సగటు అభిమాని ఆశ.. ఆకాంక్ష. దీన్ని ఇలా కాసులు రాల్చుకునేలా మార్చుకోవటం బాగోలేదంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాకు భారీగానే కలెక్షన్లు వస్తాయన్న అంచనాలు ఉన్న వేళ.. ఇంత భారీగా టికెట్ ధరల్ని పెంచటం ద్వారా సగటు అభిమానికి కష్టంగా మారుతుందంటున్నారు. సినిమా మీద ఉన్న అభిమానంతో తన వ్యక్తిగత.. కుటుంబ ఖర్చులకు కోత పెట్టి సినిమాకు ఖర్చు చేస్తారని చెబుతున్నారు. అభిమానులని దేవుళ్లుగా చెప్పే చిత్ర పరిశ్రమ.. సినిమా టికెట్ ధరల విషయానికి వస్తే.. సదరు దేవుళ్లకు అధిక ధరల వాయింపు ఎందుకు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.