పుష్ప 2: 500 కోట్ల సునామీ.. ఇదే నెవ్వర్ బిఫోర్ రికార్డ్
ఆ నెంబర్లకు బాలీవుడ్ రికార్డులు కూడా బ్రేక్ అవ్వడంతో ఐకాన్ స్టార్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది.
By: Tupaki Desk | 8 Dec 2024 6:20 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా మరోసారి చరిత్ర సృష్టిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి భారీ రికార్డులు నమోదు చేస్తూ, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి, భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డును సొంతం చేసుకుంది. ఆ నెంబర్లకు బాలీవుడ్ రికార్డులు కూడా బ్రేక్ అవ్వడంతో ఐకాన్ స్టార్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది.
డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు మూడో రోజుకు ముగింపు నాటికి రూ. 500 కోట్ల మార్క్‌ను చేరుకుంది. దీంతో వరకు ఎవరూ సాధించని ఘనతను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి పుష్ప 2 నిరూపించింది. ఈ విజయంతో పుష్ప 2 భారతీయ సినీ చరిత్రలో వేగవంతమైన 500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం గానే కాకుండా, తెలుగు సినిమా గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనతను సాధించింది.
ఈ సినిమా ప్రభంజనం గురించి మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ స్పందిస్తూ, "భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద చిత్రంగా పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద అగ్నిపర్వతంలా దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్‌ను వేగంగా చేరిన చిత్రంగా నిలిచింది" అని ప్రకటించారు. అల్లు అర్జున్ నటనతో పాటు, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన కథా, కథనాలకి విశేషంగా ఆదరణ లభించడంతో సినిమా విజయం మరింత ఉత్సాహాన్నిస్తుంది.
ఇది కేవలం ఒక సినిమా విజయంగా మాత్రమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని, ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పింది. తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకుల నుండి విశేష స్పందనతో ఈ సినిమా ముందుకు సాగుతోంది. ఈ రికార్డులు చూసిన పరిశ్రమవర్గాలు, ప్రేక్షకులు ఒక్క మాటలో "పుష్ప 2 నిజమైన బ్లాక్‌బస్టర్" అని చెబుతున్నారు.
మొత్తం మీద, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మరోసారి సౌత్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చూపించింది. పుష్ప 2 విజయంతో తెలుగు సినిమా సత్తా, బాక్సాఫీస్ పై దేనికీ తీసిపోనిదని మరోసారి నిరూపితమైంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈజీగా వెయ్యి కోట్ల మార్క్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. ఆదివారం బుకింగ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక వీకెండ్ అనంతరం కూడా సినిమా ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.