పుష్ప-2.. కెనడాలో రఫ్పాడించేసిందిగా!
ఇప్పటి వరకు దాదాపు రూ.1800 కోట్లు సాధించి అసలు తగ్గేదేలే అంటూ ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది.
By: Tupaki Desk | 4 Jan 2025 5:02 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2: ది రూల్ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రిలీజ్ అయ్యి నెల రోజులు కావొస్తున్నా.. ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు రూ.1800 కోట్లు సాధించి అసలు తగ్గేదేలే అంటూ ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తున్న పుష్ప-2.. ఓవర్సీస్ లో కూడా అదరగొడుతోంది. అనేక రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పుడు కెనడాలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక గ్రాస్ రాబట్టిన సౌత్ ఇండియన్ మూవీగా పుష్ప-2 నిలిచింది. ఏకంగా 4.13 మిలియన్ డాలర్లు రాబట్టి దుమ్ముదులిపేసింది.
అయితే కెనడాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ కల్కి 2898 ఏడీ.. 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు పుష్ప-2.. ఆ సినిమాను వెనక్కి నెట్టింది. దీంతోపాటు కల్కి నమోదు చేసిన అనేక రికార్డులను పుష్ప సీక్వెల్ బ్రేక్ చేసి దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక పుష్ప-2 హిందీ వెర్షన్ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ హిందీ వెర్షన్ మూవీ సాధించని రికార్డు అని ఇప్పటికే తెలిపాయి. అదే సమయంలో పుష్ప-2 రూ.2 వేల కోట్ల మార్క్ అందుకుంటుందో లేదోనని అంతా ఎదురు చూస్తున్నారు.
అయితే సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఇంకో వారం టైమ్ ఉంది. అప్పటి వరకు సౌత్ లో పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతితో సంబంధం లేకుండా నార్త్ లో పుష్ప-2 థియేట్రికల్ రన్ ఇంకొంత కాలం సాగే ఛాన్స్ ఈజీగా కనిపిస్తుంది. దీంతో పుష్ప-2 రూ.2 వేల కోట్లు రాబట్టడం ఈజీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.