పుష్ప 2 బాక్సాఫీస్: సోమవారం కూడా అదే సునామీ..
సౌత్ ఇండియాలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా హిందీలో కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది.
By: Tupaki Desk | 10 Dec 2024 9:10 AM GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2: ది రూల్ ఇప్పుడు హిందీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సౌత్ ఇండియాలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా హిందీలో కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రతిరోజూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ, ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తోంది. హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్ స్టామినా ఏ స్థాయిలో ఉందో ఈ సినిమా ద్వారా మరింత క్లారిటీగా అర్ధమవుతుంది.
సోమవారం కూడా పుష్ప 2 తన ఉనికిని చాటుకుంది. వీకెండ్ అనంతరం కూడా ఎంత పెద్ద సినిమా అయినా డౌన్ అవుతుంది. కానీ పుష్ప రాజ్ మేనియా అసలు తగ్గడం లేదు. 5వ రోజు రూ. 48 కోట్లు నెట్ కలెక్షన్ సాధించి, హిందీ బాక్సాఫీస్‌లో నాన్ ఫెస్టివ్ సోమవారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమా హిందీ మార్కెట్‌లో 300 కోట్ల నెట్ వసూళ్లను వేగంగా దాటేసింది.
గురువారం - 72 కోట్లు
శుక్రవారం - 59 కోట్లు
శనివారం - 74 కోట్లు
ఆదివారం - 86 కోట్లు
సోమవారం - 48 కోట్లు
5 రోజుల టోటల్ కలెక్షన్ 339 కోట్ల నెట్‌గా నిలిచింది. ఇది హిందీ సినిమా చరిత్రలో ఓ కొత్త రికార్డుని తిరగరాసినట్టే. ఇంకా, పుష్ప 2 ఉత్తర అమెరికాలో కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ సినిమా అక్కడ ఇప్పటికే 10 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టేలా చేస్తూ, ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఓ వైల్డ్ ఫైర్ లా దూసుకెళ్తోంది.
ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ విజయపరంపర కొనసాగిస్తూ, తెలుగు సినిమాను అంతర్జాతీయంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తోంది. అలాగే హిందీ మార్కెట్‌లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేయడానికి అసలు కారణం సుకుమార్ కథనం, అల్లు అర్జున్ నటనకు ఉన్న క్రేజ్. ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్‌తోనే హిందీ ప్రేక్షకుల్లో బన్నీకి మంచి గుర్తింపు లభించగా, రెండో భాగం ఆ అంచనాలను అధిగమిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
పాటలు, మాస్ ఎలిమెంట్స్, డైలాగులు, అల్లు అర్జున్ స్టైల్ – ఇవన్నీ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం పుష్ప 2 అన్ని చోట్లా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హిందీ బెల్ట్‌లో ఈ సినిమా సాధించిన విజయాలు తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచాయి. బాక్సాఫీస్‌ను ఏలుతూ, ప్రతి రోజు కొత్త రికార్డులను సెట్ చేస్తూ పుష్ప 2 దూసుకెళ్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్లకు ఈ సినిమా చాలా దగ్గరగా వచ్చేసింది.