భారత్‌లో ఇదే తొలి డాల్బీ సినిమా.. 'పుష్ప2'తో కింగ్ ప్రయోగం
ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో ఈ భారీ పాన్ ఇండియా మూవీపై హైప్ అత్యంత భారీగా పెరిగింది.
By: Tupaki Desk | 22 Nov 2024 4:26 PM GMT2024 మోస్ట్ అవైటెడ్ మూవీ `పుష్ప 2` డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో ఈ భారీ పాన్ ఇండియా మూవీపై హైప్ అత్యంత భారీగా పెరిగింది. ఇంతలోనే ఇప్పుడు ఈ హైప్ ని మరింతగా పెంచుతూ భారతదేశంలో ఎన్నడూ లేని టెక్నాలజీని పుష్ప 2తో పరిచయం చేసేందుకు పాపులర్ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రయత్నిస్తోందని తెలిసింది. `పుష్ప 2`తో అన్నపూర్ణ స్టూడియోస్ డాల్బీ సినిమా -డాల్బీ విజన్‌ని ప్రారంభించనుంది. కింగ్ నాగార్జున ఇఫీ ఉత్సవాల్లో స్వయంగా దీని గురించి ప్రకటించారు.
ఇటీవల నాగార్జున ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ 2024-గోవా)లో పాల్గొన్నారు. అక్కడ అతడు ఒక హీరోగా ఫిలింమేకర్ గా చాలా ఆలోచనలను షేర్ చేసారు. ఇదే సమయంలో భారత్‌లో డాల్బీ విజన్‌ను ప్రవేశపెడుతున్నట్లు నాగార్జున ప్రకటించారు.
ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. డాల్బీ సినిమా, డాల్బీ విజన్‌లను తమ అన్నపూర్ణ స్టూడియోస్‌కు తీసుకురావాలని తమ కుటుంబ సభ్యులు సమిష్టిగా నిర్ణయించుకున్నామని, `పుష్ప 2`తో దాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌లో ఇదే తొలి డాల్బీ సినిమా అవుతుందని, డాల్బీ ప్రతినిధులు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌ని సందర్శించారని, సకల సౌకర్యాలతో వారిని మెప్పించాక డీల్‌ను ఖరారు చేశారని నాగార్జున వివరించారు. ఎవరైనా డాల్బీ సినిమా చేయాలనుకునే వారు తమ స్టూడియోకి రావాలని ఆయన అన్నారు.
`పుష్ప 2`తో అన్నపూర్ణ స్టూడియోస్ డాల్బీ సినిమా - డాల్బీ విజన్ ప్రారంభించడంతో అభిమానులు, పరిశ్రమ నిపుణులు ఈ సాంకేతికత ఎలా పని చేస్తుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2" డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.