Begin typing your search above and press return to search.

పుష్ప-2.. ఎక్కడ హిట్టు? ఎక్కడ ఫట్టు?

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమాను నిఖార్సయిన హిట్‌గా చెప్పలేం.

By:  Tupaki Desk   |   30 Dec 2024 12:30 AM GMT
పుష్ప-2.. ఎక్కడ హిట్టు? ఎక్కడ ఫట్టు?
X

పుష్ప-2 సినిమా గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సౌండ్ వినిపించడం లేదు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్ అయింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుతో బన్నీ ఆత్మరక్షణలో పడిపోయి సినిమా ప్రమోషన్ మీద దృష్టిపెట్టలేకపోవడం పుష్ప-2 వసూళ్ల మీద ప్రభావం చూపింది. ఉత్తరాదిన ఈ సినిమా ఇరగాడేస్తూ ఇప్పటికీ వసూళ్ల మోత మోగిస్తున్నప్పటికీ.. అక్కడ మినహా ఎక్కడా ‘పుష్ప-2’ పూర్తి సంతృప్తికర ఫలితాన్ని అందించలేకపోయింది.

హిందీలో ఈ మూవీని డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్‌గా చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమాను నిఖార్సయిన హిట్‌గా చెప్పలేం. మూడు ముఖ్యమైన టెరిటరీల్లో ఒక్క రాయలసీమలో మాత్రమే ‘పుష్ప-2’ బ్రేక్ ఈవెన్ అయింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడా సినిమా బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోలేదు. ఇంకా రన్ కొనసాగుతున్నప్పటికీ.. ఈ చిత్రం నైజాం, ఆంధ్ర ఏరియాల్లో ప్లాప్ లా మిగిలేలా కనిపిస్తోంది.

ఇక దక్షిణాదిన మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే... కేరళలో సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. తమిళనాట యావరేజ్ అనిపించుకుంది. కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయింది. యుఎస్‌లో హిందీ వెర్షన్ అదరగొట్టినా.. తెలుగు వెర్షన్ నిరాశ పరిచింది. ఫుల్ రన్లో 8 మిలియన్ డాలర్ల దగ్గర ఆగిపోయింది పుష్ప-2. కల్కి అదే చోట 13 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. ఓవైపు హిందీ వెర్షన్ ఇప్పటికీ స్ట్రాంగ్‌గా ఆడుతుంటే.. తెలుగు వెర్షన్ రన్ మాత్రం పూర్తయింది. బయ్యర్‌కు స్వల్ప నష్టాలు తప్పలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రిస్మస్ వీకెండ్లో వచ్చిన సినిమాలేవీ సరైన టాక్ తెచ్చుకోనప్పటికీ ‘పుష్ప-2’ అడ్వాంటేజీని అంతగా ఉపయోగించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీ వెర్షన్ స్ట్రాంగ్ రన్ వల్ల ఓవరాల్ వసూళ్ల ఫిగర్ పెద్దగా కనిపిస్తోంది కానీ.. మిగతా వెర్షన్లు ఏవీ పూర్తి సంతృప్తికర ఫలితాన్ని ఇవ్వనట్లే కనిపిస్తోంది.