పుష్ప 2 ఫుట్ ఫాల్స్.. 6 రోజుల్లో ఎంతమంది చూశారు?
రికార్డు స్థాయిలో 6 రోజుల్లో భారతదేశంలో 3 కోట్లు పైగా ఫుట్ ఫాల్స్ ను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 11 Dec 2024 12:19 PM GMTపాన్ ఇండియా సినిమా పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ, కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫుట్ ఫాల్స్ రికార్డు లో కూడా సరికొత్తగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యధిక జనాలను థియేటర్స్ కు రప్పించిన సినిమాల్లో పుష్ప 2 ఇంత త్వరగా టాప్ లిస్టులో చేరడం మరో విశేషం. రికార్డు స్థాయిలో 6 రోజుల్లో భారతదేశంలో 3 కోట్లు పైగా ఫుట్ ఫాల్స్ ను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది భారతీయ సినీ చరిత్రలో టాలీవుడ్ కు దక్కిన మరో ఘనత అని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వంటి అంశాలు సినిమాకు మరింత ఆదరణను తీసుకువచ్చాయి. పుష్ప 2 విజయంలో కథ, పాత్రల ప్రాధాన్యతతో పాటు, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కూడా కీలక పాత్ర పోషించింది. సుకుమార్ రూపొందించిన కథ, అల్లు అర్జున్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రష్మిక సహా ఇతర నటుల అద్భుతమైన ప్రదర్శన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గరగా చేసింది.
ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే విశేష ఆదరణ లభించింది. మొదటి రోజే 72 లక్షల మంది ప్రేక్షకులు సినిమా థియేటర్లకు తరలివచ్చారు. ఈ సంఖ్య వారం చివరి వరకు ప్రతి రోజూ నిలకడగా కొనసాగింది. రెండు, మూడు రోజుల్లో 45 లక్షలు, 54 లక్షలు వరకు చేరుకోగా, నాలుగో రోజున 68 లక్షల మంది ఈ సినిమాను వీక్షించారు. ఐదో, ఆరో రోజుల్లో కూడా 37 లక్షలు, 29 లక్షలు వంటి సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు.
మొత్తంగా, కేవలం 6 రోజుల్లోనే 3.05 కోట్ల మంది ప్రేక్షకులు పుష్ప 2 సినిమాను చూసి అభిమానించారు. ఇది రికార్డు స్థాయిలో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ వేగం చూస్తుంటే, పుష్ప 2 మొత్తం 5-5.5 కోట్ల ఫుట్‌ఫాల్స్ సాధించి, దేశంలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు బాహుబలి సిరీస్ పైనే ఉంది.
ఫుట్‌ఫాల్స్ ద్వారా సాధించిన ఈ విజయాన్ని కలెక్షన్లలో కూడా ట్రెండ్ సెట్ చేస్తోంది. 6వ రోజే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ను దాటింది. ముఖ్యంగా హిందీలో 400 కోట్లకు దగ్గరగా ఉండడం విశేషం. ఈ విజయానికి ప్రధాన కారణం సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో వచ్చిన ఆదరణ. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప 2 ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. థియేటర్ల వద్ద 'హౌస్ ఫుల్' బోర్డులు పడుతుండటం ఈ విజయానికి నిదర్శనం.