పుష్ప 2.. కన్నడ సెగ?
సౌత్ లో ఎక్కువ భాషాభిమానం ఉన్న రాష్ట్రాలుగా తమిళనాడు, కర్ణాటక గురించి చెబుతారు.
By: Tupaki Desk | 25 Oct 2024 6:59 AM GMTసౌత్ లో ఎక్కువ భాషాభిమానం ఉన్న రాష్ట్రాలుగా తమిళనాడు, కర్ణాటక గురించి చెబుతారు. అక్కడి ప్రజల నుంచి నాయకుల వరకు అందరూ మొదటిగా తమ భాషకి ప్రాధాన్యత ఇస్తారు. ఇతర భాషల ఆధిపత్యాన్ని సహించరు. తమిళనాడులో అయితే ఇతర భాషలలో తెరకెక్కి డబ్బింగ్ వెర్షన్స్ గా వచ్చిన మూవీస్ ని కూడా ఎంకరేజ్ చేయరు. కర్ణాటకలో కూడా గతంలో డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉండేది.
అయితే కన్నడ సినిమాలు ఇతర భాషలలోకి డబ్బింగ్ కావడం అనేది పెరిగిన తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తేసారు. దీంతో ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలకి కన్నడంలో మంచి ఆదరణ లభించింది. భారీ కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల చిత్రాలకి కర్ణాటకలో మంచి ఆదరణ ఉంది. అక్కడ కొన్ని ఏరియాలలో స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సొంతం చేసుకుంటాయి.
ఇక డబ్బింగ్ కల్చర్ ని ప్రోత్సహించడంతో కన్నడ మూవీస్ తో సమానమైన ఆదరణ టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకి దక్కుతుంది. అయితే కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలుగా ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’ ఉన్నాయి. వీటిని బీట్ చేసే రేంజ్ లో ‘పుష్ప 2’ చిత్రాన్ని కర్ణాటకలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తామని తాజాగా డిస్టిబ్యూటర్ ప్రకటించారు. ఈ మాట కన్నడ సినిమా అభిమానులని, ఇండస్ట్రీ ప్రముఖులని కాస్తా డిజపాయింట్ చేసిందనే మాట వినిపిస్తోంది.
అందుకే ‘పుష్ప 2’కి కర్ణాటక రాష్త్రంలో కన్నడ నిర్మాతల నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతానికి ‘పుష్ప 2’కి పోటీగా కన్నడ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఒక వేళ రిలీజ్ చేస్తే మాత్రం థియేటర్స్ లలో ఎక్కువ లోకల్ సినిమాకి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి రావొచ్చని అనుకుంటున్నారు. అలా కాకుండా ఏ సినిమా పోటీలో లేకపోతే ‘పుష్ప 2’కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తమిళనాడులో మాత్రం ఈ చిత్రానికి భారీ స్థాయిలో థియేటర్స్ దొరికే అవకాశం ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.
తమిళ్ నేటివిటీకి దగ్గరగా ఈ మూవీ కథ ఉన్నా కూడా అక్కడి ప్రేక్షకులు సినిమాని చూడటానికి ఆసక్తి చూపించకపోవచ్చు. అయితే కర్ణాటకలో మాత్రం అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ‘పుష్ప 2’ కలెక్షన్స్ కి ఎలాంటి డోకా ఉండదని మేకర్స్ నమ్ముతున్నారు. ఒకవేళ కన్నడ సినిమాలు ఏవైనా రిలీజ్ అయితే అప్పుడు సానుకూలంగా చర్చించుకొని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.