Begin typing your search above and press return to search.

పుష్ప 2.. ఎంత పెద్ద ప్లాన్ వేశారంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

By:  Tupaki Desk   |   13 Oct 2024 1:30 PM GMT
పుష్ప 2.. ఎంత పెద్ద ప్లాన్ వేశారంటే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా ఎట్టకేలకు 2024 డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఆరు భారతీయ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రాన్నీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మొదటి భాగమైన 'పుష్ప: ది రైజ్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఇప్పుడు రెండో భాగం కూడా అదే స్థాయి సక్సెస్ ను అందుకోవాలని మేకర్స్ ఆశిస్తున్నారు.

సినిమాకు సంబంధించి పోస్టర్స్, టీజర్ లతో ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప 2’ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా హిందీ మార్కెట్ లో కూడా భారీగా అంచనాలు క్రియేట్ చేసుకుంది.

రిలీజ్ టైమ్ లో మిగతా సినిమాల నుంచి ఏమైనా పోటీ ఉంటే కష్టమే అనుకున్నారు. కానీ డిసెంబర్ లో రావాల్సిన 'గేమ్ చేంజర్' సంక్రాంతికి షిఫ్ట్ అవ్వడంతో ల్ 'పుష్ప 2'కి పెద్ద పోటీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 'రాబిన్ హుడ్', 'సరంగపాణి జాతకం' చిత్రాలు కూడా డిసెంబర్ మూడో వారం లో విడుదల కానున్నాయి. అయినా పుష్ప 2 పై విపరీతమైన క్రేజ్ ఉండడంతో ఈ చిత్రాలు పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేవు.

అయితే, పుష్ప 2 విడుదలకు ముందు ప్రమోషన్లతో మరింత హైప్ క్రియేట్ చెయ్యాలి. చిత్ర యూనిట్ ముందున్న ప్రధాన సవాల్ ఇదే. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో చివరి దశ షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రగిలించడం కోసం చిత్రబృందం భారీ ప్రమోషన్ స్ట్రాటజీని రూపొందిస్తోంది.

ముఖ్యంగా, చిత్ర ట్రైలర్‌ను ముంబైలో భారీ ఈవెంట్ లో విడుదల చేయాలని ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కోసం వేలాది మంది అభిమానులను ఆహ్వానించనున్నారు. ముంబైలో ఈ కార్యక్రమం చాలా భారీ స్థాయిలో ఉండబోతుంది. చిత్ర ట్రైలర్ విడుదల సమయంలో బాలీవుడ్ మార్కెట్ లో కూడా పుష్ప 2పై మరింత హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ సంకల్పించారు.

హిందీలో సినిమా క్లిక్కయితేనే బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ ను అందుకోవచ్చు. అందుకే చిత్ర యూనిట్ ఈ క్రేజ్ ను మరింతగా పెంచుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. సినిమా ఫలితాలను మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ ప్రమోషన్ కోసం గట్టిగానే ఖర్చు చేయనున్నట్లు టాక్. మరి సుకుమార్ ఆడియెన్స్ ను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.