పుష్ప 2 : ముంబై గెలాక్సీ థియేటర్‌లో కలకలం
బాలీవుడ్ ప్రేక్షకులు సైతం కొందరు తమ హీరోల ఆధిపత్యం తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.
By: Tupaki Desk | 6 Dec 2024 6:46 AM GMTఅల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నార్త్ ఇండియాలో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ స్టార్ సైతం దక్కించుకోలేని స్థాయిలో పుష్ప 2 సినిమా మొదటి రోజు వసూళ్లు సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు వసూళ్లను మరే సినిమా బ్రేక్ చేయలేదని అంతా భావించారు. కానీ పుష్ప 2 సినిమా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి ఏకంగా షారుఖ్ ఖాన్‌కే సవాల్ విసిరింది. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప 2 క్రేజ్‌ను కొందరు బాలీవుడ్ వర్గాల వారు తట్టుకోలేక పోతున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం కొందరు తమ హీరోల ఆధిపత్యం తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.
కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాహాటంగానే అనేస్తున్నారు. పుష్ప 2 సినిమా హిందీ వర్షన్‌పై కొందరు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న సమయంలో అనూహ్యంగా ముంబైలోని బాంద్రా గెలాక్సీ థియేటర్‌లో పెప్పర్ స్ప్రే ఎటాక్ కలకలం సృష్టించింది. ఇంటర్వెల్‌కి ముందు గుర్తు తెలియని వ్యక్తి థియేటర్‌లో పెప్పర్ స్ప్రే ను చల్లడంతో ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చాలా మంది దగ్గుతూ, ఊపిరి ఆడక పోవడంతో థియేటర్ బయటకు పరుగులు తీశారు. దాంతో థియేటర్ నిర్వాహకులు దాదాపు 20 నిమిషాల పాటు సినిమా ప్రదర్శనను నిలిపి వేసి, లోపల ఉన్న పెప్పర్ ఘాటును తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు.
ఈ సంఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు అందిందని తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యంతో పాటు కొందరు ప్రేక్షకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. అనుమానం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెప్పర్ ఘాటుతో కొంత మంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కొంత సమయం తర్వాత అంతా నార్మల్ అయ్యి సినిమాను పూర్తి చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఎవరికి ఏం కాలేదని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పుష్ప 2 సినిమాపై అక్కసుతో ఇలా చేసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం థియేటర్‌లో ఏదో గ్యాస్ లీక్ అయ్యిందని, అందులో కుట్ర కోణం ఏమీ ఉండక పోవచ్చు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్త్ ఇండియాలోనూ భారీ ఎత్తున ఆడుతూ రికార్డు స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.