Begin typing your search above and press return to search.

మైత్రి VS ప్రసాద్స్‌... 3% అసలు విషయం ఇదే

కానీ హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌లో మాత్రం పుష్ప 2 ను విడుదల చేయలేకపోయారు.

By:  Tupaki Desk   |   6 Dec 2024 6:15 AM
మైత్రి VS ప్రసాద్స్‌... 3% అసలు విషయం ఇదే
X

ప్రపంచ వ్యాప్తంగా అనుకున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్‌ వారు 'పుష్ప 2' ను విడుదల చేయడం జరిగింది. కానీ హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌లో మాత్రం పుష్ప 2 ను విడుదల చేయలేకపోయారు. ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌ వారు పుష్ప 2 సినిమాను విడుదల చేయలేక పోతున్నందుకు సినిమా ప్రేమికులకు క్షమాపణలు చెప్పింది. కొన్ని అనుకోని కారణాల వల్ల పుష్ప 2 సినిమాను ప్రసాద్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయామని, ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఈసారి ప్రేక్షకులను నిరాశ పరిచినందుకు క్షమించాలి అంటూ అందులో పేర్కొనడం జరిగింది.

ఇంతకు ప్రసాద్స్‌లో పుష్ప 2 సినిమా స్క్రీనింగ్‌ కాపోవడంకు కారణం ఏంటి అంటూ చాలా మంది నెట్‌లో వెతుకుతున్నారు. అసలు విషయం ఏంటి అంటే మైత్రి మూవీ మేకర్స్‌కి ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌ యాజమాన్యంకు మధ్య కలెక్షన్స్‌ షేరింగ్‌ విషయంలో రాజీ కుదరలేదు. సాధారణంగా మల్టీప్లెక్స్‌ల్లో సినిమా విడుదల అయితే వచ్చిన కలెక్షన్స్‌లో 52 శాతం డిస్ట్రిబ్యూటర్స్‌ / నిర్మాతలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ పుష్ప 2 సినిమా యొక్క క్రేజ్ నేపథ్యంలో నిర్మాతలు 55% వాటాను కోరడం జరిగింది. ఇతర మల్టీప్లెక్స్‌లు అన్నీ నిర్మాతలు కోరిన మొత్తం వాటాను ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.

ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ మాత్రం ఆ 3% పెంచి ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సారి పెంచి ఇస్తే ఇక ముందు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు అదే ఆనవాయితీ కొనసాగుతుంది. ఇది తమ వ్యాపారానికి నష్టం కలిగిస్తుంది అంటూ వారు భావించారు. అందుకే పుష్ప 2 సినిమాను ప్రదర్శించకుండా అయినా ఉంటాం తప్ప ఆ మూడు శాతం పెంచి ఇచ్చేందుకు అంగీకరించం అంటూ ప్రసాద్స్ వారు మొండికేశారు. మైత్రి మూవీ మేకర్స్ సైతం తమకు అధిక మొత్తంలో తాము డిమాండ్‌ చేసిన షేర్ ఇస్తే తప్ప ప్రసాద్స్‌కి పుష్ప 2 ను ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పారు.

సినిమా ప్రేక్షకులకు ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సినిమాను చూడటం అనేది ఒక ఎమోషన్‌. అందులో సినిమాను చూడాలని హైదరాబాద్‌లో ఉండే వారే కాకుండా బయటి ప్రాంతాల్లో ఉన్న వారు సైతం అనుకుంటారు. అలాంటి ప్రసాద్స్‌లో పుష్ప 2 ను లేకుండా చేసినందుకు ప్రేక్షకులు మైత్రి వారిపై విమర్శలు చేస్తున్నారు. ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌లో ఇతర మల్టీప్లెక్స్‌లతో పోల్చితే స్నాక్స్‌, డ్రింక్స్‌కి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేయరు. ఆ కారణం చూపించి తాము ఎక్కువ శాతం వాటాను ఇవ్వలేం అంటూ ప్రసాద్స్ వాదిస్తూ వస్తుంది. ప్రసాద్స్‌ వాదనను సమర్ధిస్తూ మైత్రి వారిని విమర్శించే వారు ఎక్కువ మంది ఉన్నారు. మైత్రి వంటి పెద్ద బ్యానర్‌ సినిమాను ప్రదర్శించక పోవడం అనేది ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ యాజమాన్యం చేసిన తప్పు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు మైత్రి నుంచి చాలా సినిమాలు రాబోతున్నాయి. మరి వాటి రిలీజ్‌ సమయంలో ప్రసాద్స్‌ ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి.