పుష్ప 2: ఓవర్సీస్ లో రికార్డుల మోత!
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజుకో రికార్డ్ ను అందుకుంటోంది.
By: Tupaki Desk | 10 Dec 2024 6:54 AM GMTఅల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజుకో రికార్డ్ ను అందుకుంటోంది. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సాలీడ్ రెస్పాన్స్ అందుకోవడం విశేషం. ఎక్కడా తగ్గకుండా రికార్డుల మోత మోగిస్తోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో మరికొన్ని రికార్డులను తిరగరాసింది. మొదటి వారం ముగిసేలోపే సినిమా 19.24 మిలియన్ డాలర్ల (సుమారు 163.3 కోట్ల రూపాయలు) గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
2024లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు చేసిన ఇండియన్ సినిమా గా నిలిచింది. అంతేకాక, ఓవర్సీస్ మార్కెట్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న నాలుగో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా నార్త్ అమెరికా మార్కెట్‌లో 9.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి టాప్ లో కొనసాగుతోంది. యూకే అలాగే ఐర్లాండ్ మార్కెట్లలో 1.43 మిలియన్ డాలర్లతో ఊహించని హవా చూపించింది.
ఆస్ట్రేలియాలో 1.5 మిలియన్ డాలర్లు, న్యూజిలాండ్ లో 252K డాలర్లు వసూళ్లు చేయడమే కాకుండా, మిడిల్ ఈస్ట్, యూఏఈ ప్రాంతాల్లో 3.9 మిలియన్ డాలర్లు రాబట్టి కొత్త రికార్డును సృష్టించింది. జర్మనీ, మలేషియా, సింగపూర్ వంటి చిన్న మార్కెట్లలో కూడా పుష్ప 2 మంచి వసూళ్లు రాబట్టింది. శ్రీలంకలో సైతం 97K డాలర్లు సాధించింది. యూరప్ ఇతర ప్రాంతాల్లో, మరియు ప్రపంచవ్యాప్తంగా 1.1 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది.
ఈ లెక్కన, సినిమా మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ 19 మిలియన్స్ దాటడం విశేషం. సినిమాకు ఉన్న భారీ అంచనాలు, ప్రత్యేకంగా హిందీ వెర్షన్ పై ప్రేక్షకుల నుండి వచ్చిన ఆదరణతో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ ట్రెండ్ ఇంకొన్ని వారాలు కొనసాగుతుందని, ఆర్ఆర్ఆర్ లాంటి మరిన్ని రికార్డులను దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పుష్ప 2 ద్వారా అల్లు అర్జున్ తన గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని మరింతగా బలోపేతం చేసుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ ఆయన భవిష్యత్ ప్రాజెక్టులకు మరింత పునాదిగా నిలుస్తుందని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. రాబోయే రోజుల్లో పుష్ప 2 ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.