'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లోనూ తగ్గేదేలే!
కేవలం ప్రమోషన్స్ కోసమో భారీగా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 Nov 2024 3:48 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా "పుష్ప 2: ది రూల్". ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో, పాన్ ఇండియా వైడ్ గా హైప్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో, మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. కేవలం ప్రమోషన్స్ కోసమో భారీగా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
'పుష్ప 2' సినిమాకు సంబంధించి గ్రాండ్ గా ఆఫ్ లైన్ ప్రమోషన్స్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన నిర్మాతలు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందు కోసం దాదాపు 50 కోట్ల వరకూ ఖర్చు చేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో అగ్రిమెంట్స్ చేసుకున్నారని, ఇప్పటికే ప్రమోషన్స్ ప్లాన్ కూడా సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది.
'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు. ఎక్కడ, ఎలా చేస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించే లేదు కానీ.. ఎక్కువ శాతం నార్త్ ఇండియాలో చేసే అవకాశం ఉందని అంటున్నారు. అనుమతి లభిస్తే తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు పెద్ద ఈవెంట్స్ చెయ్యాలని భావిస్తున్నారు. అలానే ఇండియాలోని ఆరు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బన్నీతో పాటుగా చిత్ర బృందం అంతా ఈ ఈవెంట్స్ లో పాల్గొననున్నారు.
'పుష్ప 1' సినిమాకి ఇతర భాషల్లో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కానీ ఈసారి అలా కాకుండా, పక్కా ప్రణాళికతో పాన్ ఇండియా వైడ్ గా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ముంబై, చెన్నై, పాట్నా, కొచ్చి, హుబ్లీ లాంటి సిటీలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారని టాక్. అంతేకాదు ఎక్కడికి వెళ్తే అక్కడి స్థానిక స్టార్ యాక్టర్స్ ను ఆహ్వానించి, ఈ ప్రమోషన్స్ లో భాగం చేస్తారని టాక్ నడుస్తోంది. కుదిరితే ఒకసారి యూఎస్ వెళ్లి ప్రమోట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
భారీ ఈవెంట్స్ చేయడమే కాకుండా, మధ్య మధ్యలో ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసి మీడియాతో ఇంటరాక్ట్ అవబోతున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన పాటలను కూడా రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజైన వెంటనే ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయాలని భావిస్తున్నారు. అలానే హీరో హీరోయిన్లతో ఇంటర్వ్యూలు రికార్డ్ చేయబోతున్నారు. అన్ని భాషలకు కామన్ గా ఒకటే ఇంటర్వ్యూ కాకుండా.. వివిధ భాషల్లో ఇంటర్వ్యూలు ఇవ్వాలని చూస్తున్నారు.
ఆల్రెడీ నార్త్ అమెరికాలో 'పుష్ప 2' చిత్రం కోసం వినూత్నంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అక్కడి సినిమా థియేటర్లలో 'పుష్ప' బ్రాండ్ పాప్ కార్న్ టబ్స్, కూల్ డ్రింక్ క్యాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ‘కంగువ’ ప్రీమియర్స్ నుంచి ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏ భారతీయ సినిమాకి కూడా ఈ విధమైన ప్రమోషన్స్ చెయ్యలేదు. ఈ యూనిక్ ప్రమోషనల్ స్ట్రాటజీ ఓవర్ సీస్ మార్కెట్ లో బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.
మొత్తం మీద రిలీజ్ ముందు రోజు వరకూ అందరూ 'పుష్ప 2' గురించే మాట్లాడుకునేలా, గట్టిగా ప్రమోషన్స్ చేయటానికి మేకర్స్ ప్రణాళికలు వేసుకున్నారు. దీని కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా చుట్టూ నెలకొన్న హైప్ ను దృష్టిలో పెట్టుకొని అన్ని భాషల్లోనూ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు.