Begin typing your search above and press return to search.

‘పుష్ప: ది రూల్’ మూవీ రివ్యూ

Pushpa 2 The Rule Movie Review

By:  Tupaki Desk   |   5 Dec 2024 1:15 AM GMT
‘పుష్ప: ది రూల్’ మూవీ రివ్యూ
X

‘పుష్ప: ది రూల్’ మూవీ రివ్యూ

నటీనటులు: అల్లు అర్జున్-రష్మిక-ఫాహద్ ఫాజిల్-రావు రమేష్-జగపతిబాబు-సునీల్-అనసూయ-జగదీష్ భండారి-ఆదిత్య మీనన్-తారక్ పొన్నప్ప-అజయ్ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: మిరస్లో కూబా

మాటలు: శ్రీకాంత్ విస్సా

నిర్మాతలు: రవిశంకర్ యలమంచిలి-నవీన్ యెర్నేని

కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్

‘పుష్ప:ది రూల్’.. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం. మూడేళ్ల కిందట పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిన ‘పుష్ప: ది రైజ్’కు ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప-2’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

కూలీగా మొదలుపెట్టి ఎర్రచందనం సిండికేట్ కు నాయకుడిగా ఎదిగిన పుష్ప (అల్లు అర్జున్).. తనకు అడ్డు వచ్చిన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫాహద్ ఫాజిల్)ను ఘోరంగా అవమానించడంతో అతను ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంటాడు. పుష్ప ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ కు షెకావత్ అడుగడుగునా అడ్డు తగులుతుండడం.. సిండికేట్లో కీలకమైన వ్యక్తిని చంపేయడంతో సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో సిండికేట్ అంతా కలిసి షెకావత్ కు పుష్పతో సారీ చెప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ సారీ చెప్పినట్లే చెప్పి పుష్ప అడ్డం తిరగడంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో పుష్ప ఒక భారీ డీల్ ఒప్పుకుంటాడు. మరి షెకావత్ రూపంలో తలెత్తిన పెద్ద అడ్డంకిని అతనెలా దాటాడు... ఈ డీల్ పూర్తి చేశాడు.. పుష్ప-షెకావత్ పోరు ఎక్కడి దాకా వెళ్లింది.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

‘పుష్ప’లో హీరో ఒక సాధారణ కూలీగా మొదలుపెట్టి.. ఎర్రచందనం సిండికేట్ ను తన గుప్పెట్లోకి తీసుకునే డాన్ స్థాయికి ఎదుగుతాడు. ఈ జర్నీలో చాలా కథ ఉంటుంది. ఆ కథలో ఎన్నో మలుపులుంటాయి. బోలెడంత మంది విలన్లు.. వాళ్లు సృష్టించే అడ్డంకులు.. ఎత్తులు పై ఎత్తులు.. ఇవన్నీ కాక ఓవైపు హీరోకు ఇంటి పేరు లేకపోవడం వెనుక ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ.. ఇంకోవైపు ఓ అమ్మాయితో తనకో లవ్ స్టోరీ.. ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీలా అందించాడు సుకుమార్. కొన్ని లోపాలున్నప్పటికీ.. ఒక విస్తృతమైన కథ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ పెద్ద కథలో అదిరిపోయే ఎలివేషన్లు.. పేలిపోయే యాక్షన్ ఘట్టాలతో ‘పుష్ప’ ప్రేక్షకులకు ఇవ్వాల్సిన హై ఇచ్చేసింది. ఐతే ‘పుష్ప: ది రైజ్’ ముగిసేసరికి.. హీరో ఆల్రెడీ పెద్ద రేంజికి ఎదిగిపోయాడు. ఇక అక్కడ్నుంచి ఇంకాస్త ఎత్తుకు ఎదగడం లేదా కింద పడడం.. మళ్లీ లేవడం తప్పితే కథగా చెప్పడానికి పెద్దగా స్కోప్ లేదు. మళ్లీ ఒక జర్నీ చూపించడానికి ఇక్కడ అవకాశమే లేదు. ప్రధాన పాత్ర జీరో నుంచి మొదలు పెట్టి ఒక స్థాయిని అందుకునేలా కథను నడిపిస్తే ప్రేక్షకులకు మంచి కిక్కు వస్తుంది కానీ.. ఆల్రెడీ ఒక స్థాయి అందుకున్న వ్యక్తి ప్రయాణాన్ని చూపిస్తే అందులో మజా ఉండదు. అందుకే ‘పుష్ప’ తరహా కథలకు సీక్వెల్ తీసి మెప్పించడం అంత తేలిక కాదు. ఐతే ఈసారి కథతో మెప్పించలేనని సుకుమార్ కు బాగానే తెలుసు కాబట్టి.. ప్రేక్షకులకు దాని మీద దృష్టి మళ్ళని విధంగా మాయ చేసే ‘ఎపిసోడ్ల’ మీద ఆయన దృష్టిసారించాడు. ఊపిరి సలపనివ్వని ఎలివేషన్ సీన్లు.. ఉర్రూతలూగించే యాక్షన్ ఘట్టాలతో సినిమాను నింపేశాడు. కథ పలుచనవ్వడం ఒకింత నిరాశపరిచినా.. మాస్ కు పూనకాలు తెప్పించే హై ఓల్టేజ్ ఎపిసోడ్ల వల్ల ‘పుష్ప: ది రూల్’ పక్కా పైసా వసూల్ సినిమాగా తయారైంది.

మాస్ అందు సుకుమార్ మాస్ వేరు. ఆయన కూడా హీరో ఎలివేషన్ల మీద ఆధారపడతారు. ఓవర్ ద టాప్ మాస్ సీన్లు తీస్తారు. యాక్షన్ ఘట్టాలు టూమచ్ గానే కనిపిస్తాయి. కానీ ఆయన సినిమాల్లో హీరోకు అవసరం లేని బిల్డప్ ఉండదు. ఏదో ఫైట్ పెట్టాలి కాబట్టి ఫైట్ అన్నట్లు ఉండదు. ఎలివేషన్ కొంచెం అతి అనిపించినా.. అందులో ఒక రీజనింగ్ ఉంటుంది. ఫైట్ అతిశయంగా అనిపించినా.. అందులో ఒక లాజిక్ దాగి ఉంటుంది. ప్రతి సన్నివేశానికీ ఒక మెరుపు లాంటి ముగింపునివ్వడం ద్వారా సాధారణ మాస్ సన్నివేశాన్ని.. ఒక సగటు యాక్షన్ ఘట్టాన్ని కూడా ఆసక్తికరంగా మార్చే నైపుణ్యం ఆయన సొంతం. ‘పుష్ప: ది రూల్’లో ప్రేక్షకులను చాలా ఎపిసోడ్లు ఎంగేజ్ చేసేలా తీర్చిదిద్దడంలో ఈ నైపుణ్యమే కనిపిస్తుంది. ఒక సీన్లో పుష్ప మనుషుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని షెకావత్ స్టేషన్లో పడేస్తాడు. పుష్ప అక్కడికెళ్లి వాళ్లందరినీ విడిపించుకుని వస్తాడు. ఐతే అతనేమీ అక్కడ ఫైట్ చేయడు. తన మనుషులతో విధ్వంసమూ సృష్టించడు. మరీ ఏం చేసి వాళ్లను విడిపించుకు వస్తాడు అనే దాంట్లోనే సుకుమార్ మార్కు ఉంటుంది. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే.. గమ్మత్తుగా అనిపించేలా ఆ సన్నివేశాన్ని ముగించిన తీరుకు విజిల్స్ పడకుండా ఉండవు. అలాగే తన చేతిలో జరిగిన అవమానానికి పగబట్టేసి తన వ్యాపార సామ్రాజ్యానికి కూల్చేయడానికి సిద్ధపడ్డ షెకావత్ కు ఒక ‘సారీ’ చెబితే అంతా సద్దుమణిగే స్థితిలో పుష్ప ఏం చేస్తాడు అన్నది ‘పుష్ప-2’లో మరో పేలిపోయే విషయం. ఈ ఎపిసోడ్ అయ్యేసరికి ప్రేక్షకులు కుదురుగా కూర్చోవడం కష్టం. ‘పుష్ప-2’లో చాలా సీన్లు మామూలుగానే మొదలవుతాయి. కానీ మనం ఊహించని డైలాగ్స్.. మన అంచనాలకు అందని ఒక మెరుపు లాంటి ముగింపుతో సుకుమార్ స్వీట్ షాక్ ఇస్తాడు. హీరోకు ఎదురే లేనట్లు చూపించడం.. అతడికి టూమచ్ ఎలివేషన్ ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా.. మాస్ కోణంలో చూస్తే ఆయా ఎపిసోడ్లు ఇచ్చే ‘హై’ మాత్రం మామూలుగా ఉండదు.

ముందే అన్నట్లు ‘పుష్ప: ది రూల్’కు కథ పరంగా సమస్య ఉంది. ఇందులో కథంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ‘పుష్ప: ది రైజ్’ చివర్లోనే రెండో భాగంలో పుష్ప వెర్సస్ షెకావత్ పోరు చూడబోతున్నామని సంకేతాలు ఇచ్చేశాడు సుకుమార్. అందుకు అనుగుణంగానే ఇక్కడ కథ నడుస్తుంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అంటూ సాగే పోరే సినిమాలో చాలా భాగాన్ని ఆక్రమించేసింది. కానీ ఆ పోరును చాలా వరకు ఆసక్తికరంగానే చూపించాడు సుకుమార్. హీరోకు ఒక ఇంట్రో సీన్ సరిపోదని.. రెండుసార్లు ఎలివేషన్లతో కూడిన ఇంట్రోలు ఇచ్చిన సుకుమార్.. ఆ తర్వాత కూడా ఎలివేషన్ల మీదే దృష్టిపెట్టాడు. షెకావత్ రంగ ప్రవేశం చేసి హీరోకు బ్రేకులు వేశాకే కథ కొంచెం రక్తి కడుతుంది. విరామ సమయానికి ఇద్దరి మధ్య పోరు పతాక స్థాయికి చేరుకుని ‘పుష్ప-2’ రసపట్టులో పడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉన్న హై రెండో అర్ధంలో కూడా కొనసాగి ఉంటే ‘పుష్ప-2’ రేంజే వేరుగా ఉండేది. కానీ ద్వితీయార్దంలో భారమంతా ‘జాతర’ ఎపిసోడ్ మీద పెట్టేశాడు సుకుమార్. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే జాతర ఎపిసోడ్ ఇటు యాక్షన్ పరంగా కిక్ ఇస్తూనే.. ఇంకోవైపు ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తుంది. కానీ దానికి ముందు తర్వాత ఎపిసోడ్లలో బిగి తగ్గింది. షెకావత్ ముందు పుష్ప చేసే సవాలుతో తర్వాత వీరి పోరు వేరే స్థాయికి చేరుతుందనుకుంటాం. కానీ ఒక భారీ యాక్షన్ బ్లాక్ తో ఊరించి.. ఆ తర్వాత ఓ కామెడీ సీన్ పెట్టి ఉస్సూరుమనిపించేశాడు సుకుమార్. దీని వల్ల ఒక్కసారిగా ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ఇక షెకావత్ మీదే మొత్తం కథను నడపడం బాగోదని.. చివరి అరగంటను మరోవైపు షిఫ్ట్ చేసి కొత్త విలన్ తో ఇంకో ‘సినిమా’ చూపించాడు దర్శకుడు. అది మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. మాస్ కు పూనకాలు తెప్పించేలా సాగిన చివరి ఫైట్ ఓకే కానీ.. క్లైమాక్సులో ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. యాక్షన్ ఘట్టం తర్వాత సినిమాకు ఇచ్చిన భావోద్వేగ ముగింపు మాత్రం బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే.. ‘పుష్ప-2’ను ఊర మాస్ ఎపిసోడ్లతో కూడిన ఒక ప్యాకేజీగా చెప్పొచ్చు. ఇందులో కథ తగ్గినా ఎలివేషన్లకు మాత్రం ఢోకా లేదు.

నటీనటులు:

అల్లు అర్జున్ కెరీర్లో కచ్చితంగా పుష్ప పాత్ర ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. పుష్ప అనే పాత్రను నరనరానా జీర్ణించేసుకున్నట్లు అతను ఆ పాత్రతో వేసిన ఇంపాక్ట్ చాలా బలమైంది. మనం చూస్తున్నది అల్లు అర్జున్ అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయి పుష్పతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆ పాత్రకు తగ్గట్లుగా అతను చూపించిన యాటిట్యూడ్.. తన హావభావాలు అన్నీ కూడా వేరే లెవెల్ అనిపిస్తాయి. జాతర ఎపిసోడ్లో బన్నీ పెర్ఫామెన్స్ అయితే పీక్స్ అన్నట్లే. పుష్ప ఇగోను టచ్ చేసినపుడు అతనెలా తయారవుతాడో బన్నీ తన పెర్ఫామెన్సుతో చూపించిన తీరు వావ్ అనిపిస్తుంది. శ్రీవల్లిగా రష్మిక మరోసారి మెప్పించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో గ్లామర్ డోస్ పెంచింది. అలాగే పెర్ఫామెన్సూ అదరగొట్టింది. జాతర ఎపిసోడ్లో బన్నీతో పోటీ పడి నటించింది. విలన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ చెలరేగిపోయాడు. తెరపై తాను కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టాడు. రావు రమేష్ కు ‘పుష్ప-1’తో పోలిస్తే ఇందులో పాత్ర ప్రాధాన్యం పెరిగింది. ఆయన చాలా బాగా చేశారు. జగపతిబాబే కొంచెం కృత్రిమంగా అనిపించారు. అజయ్ ఆఖరి సన్నివేశంలో బాగా చేశాడు. పుష్ప ఫ్రెండు కేశవగా జగదీష్ అలవాటైన రీతిలో నటించాడు. తారక్ పొన్నప్ప తక్కువ స్క్రీన్ టైంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సునీల్.. అనసూయలకు ఇందులో పెద్దగా స్కోప్ లేదు. శ్రీలీల ‘కిసిక్’ పాటలో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘పుష్ప-2’కు ఢోకా లేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగానే పేలాయి. పీలింగ్స్.. కిసిక్ సాంగ్స్ వినడానికే కాదు.. చూడ్డానికీ బాగున్నాయి. టైటిల్ సాంగ్ కూడా ఓకే. సూసేకి.. మెలోడీ వినసొంపుగా ఉంది. కానీ దాని చిత్రీకరణతో సుకుమార్ పెద్ద షాకే ఇచ్చాడు. అది మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. దేవి నేపథ్య సంగీతం మాస్ కు పూనకాలు తెప్పిస్తుంది. జాతర ఎపిసోడ్.. క్లైమాక్సులో చెవుల తుప్పు వదలగొట్టేశాడు దేవి. ఎలివేషన్ సీన్లను తన ఆర్ఆర్ తో మరింత ఎలివేట్ చేశాడు. మిరస్లో కూబా ఛాయాగ్రహణం సూపర్బ్. విజువల్స్ అదిరిపోయాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో ఆర్ట్ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ పనితనం ప్రశంసనీయం. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతమాత్రం రాజీ పడలేదు. పాటల లిరిక్స్.. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ‘‘ఏంది సామి పీడ కల వచ్చిందా’’ అని శ్రీ వల్లి అడిగితే.. ‘‘నిజం కంటే పీడ కల ఏముంది’’ అంటూ ఇంటి పేరు లేక తను పడే బాధను పుష్ప చెప్పడం సూపర్బ్. అలాగే హెలికాఫ్టర్ ఎక్కాక కాలు మీద కాలేసుకోమంటే పుష్ప చెప్పే డైలాగ్ కూడా అదిరింది. స్క్రిప్టు రూపకల్పనలో సుకుమార్ చాలామంది సాయం తీసుకున్నట్లు టైటిల్ క్రెడిట్స్ చూస్తే అర్థమవుతుంది. అయినా సినిమా అంతటా తన మార్కు ఉండేలా చూసుకున్నాడు. సుకుమార్ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఆయనలో ఇంత మాస్ ఉందా అనిపించేలా ఊర మాస్ గా ఎపిసోడ్లను తీర్చిదిద్దాడు. కథాకథనాల పరంగా ‘రంగస్థలం’ సహా కొన్ని చిత్రాల్లో సుకుమార్ చూపించిన బ్రిలియన్స్.. క్లాస్ టచ్ ఇందులో లేదన్నది వాస్తవం. కానీ తన మార్కుతోనే ఆయన మాస్-ఎలివేషన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. తన బ్రిలియన్స్ తో పరిమిత వర్గాన్ని మెప్పించడం కంటే.. కొంచెం స్థాయి తగ్గించుకుని అయినా ఎక్కువమందిని ఎంటర్టైన్ చేయడమే ధ్యేయంగా ఆయనీ సినిమా తీసినట్లు అనిపిస్తుంది.

చివరగా: పుష్ప-2.. మాస్ జాతర

రేటింగ్ - 3/5