బన్నీ తగ్గేదేలే అంటే, చరణ్ మాత్రం తగ్గుతాడా?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2: ది రూల్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 3 Dec 2024 7:06 AM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2: ది రూల్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ వైడ్ గా 12 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో టికెట్ రేట్ల విషయంలో మునుపెన్నడూ లేనంత హైక్ ఇచ్చారు. ట్రెండ్ చూస్తుంటే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ పెడుతుందనిపిస్తోంది. మొదటి రోజే చాలా రికార్డులు బ్రేక్ అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'పుష్ప 2' సినిమా ఎల్లుండి డిసెంబర్ 5న విడుదల అవుతుండగా.. రేపు డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్ షోలు, అర్థరాత్రి బెనిఫిట్ షోలు వేసుకోడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. నైజాంలో రాత్రి 9.30 గంటలకు ప్రదర్శించబడుతున్న షోలకు రూ. 800 పెంచుకోడానికి పర్మిషన్ ఇచ్చారు. దీంతో ప్రీమియర్స్ కి టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 1100, మల్టీఫ్లెక్స్ లలో రూ. 1200 ఉంటాయి. ఏపీలో మాత్రం ప్రీమియర్స్ కి రూ. 800 టికెట్ రేటుని నిర్ణయించారు. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది.
నైజాంలో డిసెంబర్ 5 - 8 వరకు మొదటి నాలుగు రోజులు టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 - 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150.. డిసెంబర్ 17 - 23 వరకూ సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు. ఏపీలో మాత్రం శ్లాబ్ సిస్టమ్ ప్రకారం 5వ తేదీన 6 షోలకు అనుమతినిస్తూనే, లోవర్ క్లాస్ కు రూ.100, అప్పర్ క్లాస్ కు రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ. 200 వరకు టికెట్ రేటు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో జారీ చేసింది. పైన చెప్పుకున్న టికెట్ రేట్ల పెంపుతో డిసెంబర్ 6 - 17 వరకు రోజుకు 5 షోలను ప్రదర్శిస్తారు.
మొత్తం మీద 'పుష్ప 2' సినిమాకి తెలంగాణాలో 19 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా 13 రోజుల పాటు అదనపు షోలతో ధరలు పెంచుకోవచ్చని చెప్పారు. ఇటీవల కాలంలో ఏ పెద్ద సినిమాకి కూడా రెండు రాష్ట్రాల్లో ఈ రేంజ్ లో రేట్లు పెంచుకోడానికి పర్మిషన్ ఇవ్వలేదు. 'కల్కి 2898 ఏడీ', 'దేవర 1' సినిమాలతో 'పుష్ప 2' మూవీకి ధరలు పెంచుకోడానికి భారీగా వెసులుబాటు కల్పించినట్లైంది. టాలీవుడ్ లో ఎప్పుడూ లేనంత టికెట్ రేట్ల హైక్ తెచ్చుకున్న 'పుష్ప 2'.. ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
'పుష్ప 2: ది రూల్' చిత్రానికి ఈ స్థాయిలో రేట్లు ఉన్నా, ఓ వర్గం ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వక్తం అవుతున్నా సరే, టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రూ. 85 కోట్లకు పైగా ప్రీ సేల్స్ ద్వారా వచ్చాయి. అధిక ధరలు పెట్టినా ప్రేక్షకాదరణ దక్కుతోంది కనుక, రాబోయే పెద్ద సినిమాల మేకర్స్ అంతా ఇదే రేంజ్ లో టికెట్ రేట్ల పెంపు ఆశించే అవకాశం ఉంది. 'పుష్ప 2' తర్వాత రిలీజ్ అయ్యే పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వస్తోన్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఇదే. మేకర్స్ తో రెండు ప్రభుత్వాలతో సత్సంభందాలు ఉన్నాయి కాబట్టి.. కచ్చితంగా మంచి హైక్స్ కోసం ప్రయత్నిస్తారని అనుకోవచ్చు.
'గేమ్ ఛేంజర్' సినిమాకి కూడా 'పుష్ప 2' స్థాయిలోనే టికెట్ రేట్ల పెంపుకి అనుమతి అడిగే ఛాన్స్ ఉంది. 'పుష్ప 2' ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్, ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసిన తర్వాత హైక్ ఎంత అడగాలనే దానిపై నిర్మాతలు ఓ నిర్ణయానికి రావొచ్చు. కాకపోతే అన్ని సినిమాలకూ ఈ అధిక టికెట్ ధరలు వర్కౌట్ అవుతాయా? అంటే చెప్పలేం. ఎందుకంటే 'పుష్ప 2'కి సీక్వెల్ క్రేజ్ ఉన్నట్లుగా, మిగతా అన్నిటికీ అలానే ఉంటుందని అనుకోలేం. అయినప్పటికీ వీలైనంత వరకూ ఓపెనింగ్స్ ద్వారానే ఆడియన్స్ నుంచి వసూలు చేయాలని నిర్మాతలు భావిస్తారు కాబట్టి, పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంపు అనేది కచ్చితంగా ఉంటుందని చెప్పాలి.