పుష్ప 2: రెండవ రోజు ఆ ఎఫెక్ట్ పడిందా?
మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు.
By: Tupaki Desk | 6 Dec 2024 8:04 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన "పుష్ప 2: ది రూల్" గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా నిర్మాణ సంస్థ మైత్రి వారికి అలాగే సుకుమార్ కు కూడా ఇది బిగ్గెస్ట్ మూవీ. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ప్రీమియర్ షోల ద్వారా మాత్రమే రూ.12 కోట్లు వసూలు చేయగా, తొలి రోజున ఇండియాలోనే రూ.165 కోట్లు (నెట్) వసూలు అందుకున్నట్లు టాక్ వస్తోంది. అయితే, మొదటి రోజు భారీ వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా రెండవ రోజు మాత్రం ఉహించని పరిస్థితిని ఎదుర్కొంటోంది. బాక్సాఫీస్ వద్ద టిక్కెట్ సేల్స్ కొంత తగ్గినట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్లో టికెట్ ధరలపై పెరిగిన విమర్శలు రెండవ రోజు టికెట్ బుకింగ్స్ పై ప్రభావం చూపించాయని అంటున్నారు. ప్రధాన ఏరియాల్లోనే రెండవ రోజు టికెట్ అమ్మకాలు కొంత తగ్గుదలని చూస్తున్నాయి. విద్యార్థులు, యువత మొదటి వీకెండ్ లో ఎక్కువగా సినిమాకి వచ్చేవారు. కానీ టికెట్ ధరల వల్ల ఈసారి ఈ వర్గాలు పెద్దగా థియేటర్లకు రాలేకపోతున్నట్లు సమాచారం.
చాలా మంది ప్రేక్షకులు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయంతో రెండవ రోజు టికెట్లు బుక్ చేయడం తగ్గించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో కూడా టికెట్ ధరలపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అక్కడి బుకింగ్స్‌లో రెండవ రోజు కొంత ప్రభావం ఉన్నట్లు థియేటర్ల నుంచి సమాచారం అందుతోంది. ఇక ఈ ప్రభావం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లను ఆందోళనకు గురి చేస్తోంది. వారు నిర్మాతలకు టికెట్ ధరలు తగ్గించాలని సూచించారు.
అయితే, "పుష్ప 2" సాంకేతిక నాణ్యత, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవని ట్రేడ్ అనలిస్ట్‌లు భావిస్తున్నారు. కానీ ఆ ప్రభావం పూర్తిగా కనిపించాలంటే, టికెట్ ధరలను తగ్గించడం అనివార్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల మధ్య, రెండవ రోజు కలెక్షన్లు ఏమేరకు ఉంటాయో చూడాలి. పుష్ప 2 ఇప్పటికే మొదటి రోజే భారీగా వసూలు చేసినందున, ఈ సినిమా విజయాన్ని నిలబెట్టుకోవడానికి నిర్మాతలు టికెట్ ధరల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం.