పుష్ప 2 వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్.. ఎంత రావచ్చు?
ప్రీమియర్ షోలతో పాటు మొదటి రోజు టికెట్ అమ్మకాలు రికార్డుల స్థాయిలో కొనసాగుతున్నాయి.
By: Tupaki Desk | 4 Dec 2024 1:32 PM GMTఅల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధంగా ఉంది. ముందు రోజే, డిసెంబర్ 4న, ఇండియా, యుఎస్‌లో ప్రత్యేక ప్రీమియర్ షోలతో అసలు జాతర స్టార్ట్ కానుంది. ఈ చిత్రం దాదాపు 12,000 స్క్రీన్లతో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ఇది బిగ్గెస్ట్ రికార్డ్.
ప్రీమియర్ షోలతో పాటు మొదటి రోజు టికెట్ అమ్మకాలు రికార్డుల స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు, భారతదేశంలో రూ. 70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి కాగా, ప్రీమియర్ షోస్ కోసం రూ. 7 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలను కలుపుకుని, మొత్తం రూ. 77 కోట్ల ప్రీ-సేల్స్ సాధించగా, విడుదల తేదీ నాటికి ఇది రూ. 90 నుండి రూ. 100 కోట్ల వరకు చేరే అవకాశముంది. ఇందులో తెలుగు వెర్షన్ రూ. 38 కోట్లతో ముందంజలో ఉండగా, హిందీ వెర్షన్ రూ. 27 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది.
వరల్డ్ వైడ్ గా కూడా ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లో ప్రీమియర్ షోలతో కలిపి రూ. 35 కోట్ల టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఈ లెక్కలను బట్టి, ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మొదటి రోజు ఇండియాలో రూ. 170 కోట్ల వరకు సాధించే అవకాశం ఉంది, ఇక రూ. 65 కోట్ల వరకు ఓవర్సీస్ మార్కెట్‌లో రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా మొదటి రోజు రూ. 235 కోట్ల గ్లోబల్ కలెక్షన్లు ఈ చిత్రానికి లభించవచ్చని అంచనా.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఒక్క రోజులోనే రూ. 73 కోట్ల గ్రాస్ సాధించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలో రూ. 15 కోట్లు, తమిళనాడులో రూ. 8 కోట్లు, కేరళలో రూ. 7 కోట్ల వరకు కలెక్షన్లు రావచ్చని అంచనా. ఇక అంతర్జాతీయ మార్కెట్లో $7.25 మిలియన్ నుంచి $8.25 మిలియన్ (62 నుండి 72 కోట్లు) వరకు కలెక్షన్లు రవచ్చని చెబుతున్నారు. ఈ సూపర్ బిగ్గెస్ట్ రికార్డుతో, బాహుబలి 2 అందించిన రూ. 200 కోట్ల ఓపెనింగ్ డే రికార్డును పుష్ప 2 బద్దలుకొట్టనుంది.
అల్లు అర్జున్ తన స్టార్ పవర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ, భారతీయ సినిమాల్లో ఒక అతిపెద్ద క్రౌడ్ పుల్లర్‌గా రానిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్ ను వీలైనంత త్వరగా అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా సినిమా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసిందని అంటున్నారు. ఇక టాక్ బాగుంటే అనుకున్న టార్గెట్ ను ఫస్ట్ వీక్ లోనే అందుకునే అవకాశం ఉంది.