పుష్పరాజ్ అంతర్జాతీయ మార్కెట్ కొల్లగొట్టే వ్యూహం
నిజానికి పుష్ప చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్రేజ్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు పుష్ప 2 కోసం ఆ క్రేజ్ ని ఎన్‌క్యాష్ చేయాలంటే సినిమా పండగల్లో ప్రముఖులతో రిలేషన్ షిప్ అవసరం.
By: Tupaki Desk | 20 Feb 2024 8:30 AM GMTఅంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో పాల్గొనడం, పెద్ద స్థాయిలో ప్రపంచ విఖ్యాత సినీప్రముఖులతో సత్సంబంధాలు కొనసాగించడం నిజానికి ఒక అద్భుతమైన మార్కెట్ ఎత్తుగడ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, సంస్థలను కలవడం ద్వారా తమ ఉత్పత్తిని ప్రపంచ మార్కెట్లో విక్రయించడం చాలా సులువు. బాహుబలి, బాహుబలి 2 కోసం ఇలాంటి ఎత్తుగడను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి- ఆర్కా మీడియా బృందం అనుసరించి పెద్ద స్థాయిలో విజయం సాధించారు.
ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తిని అమ్ముకోవాలనే ఆలోచన చేయడంలో ఈ బృందం సాధించిన విజయం దేశంలోని చాలా మంది సినీప్రముఖులకు స్ఫూర్తినిచ్చింది. ఎంపిక చేసుకున్న కంటెంట్ యూనివర్శల్ గా ఉన్నప్పుడు దానిని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించినప్పుడు బయటి మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంటుందని కూడా ప్రూవ్ అయింది. జపాన్, చైనా మార్కెట్లలోను ఇప్పుడు ప్రభాస్ పరిచయమయ్యారంటే బాహుబలి ఫ్రాంఛైజీ కోసం ఎంచుకున్న రిలీజ్ మోడల్ ప్రధాన కారణం.
ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ సినిమాని కూడా ప్రపంచ మార్కెట్లో పెద్ద స్థాయిలో ప్రమోట్ చేయగలిగారు. అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లోను ఆర్.ఆర్.ఆర్ కి ప్రచారం దక్కింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్స్, ఫిలింక్రిటిక్స్ పురస్కారాల్లో రాజమౌళి అండ్ టీమ్ హాలీవుడ్ ప్రముఖులను కలుసుకుని మునుముందు మార్కెట్ కి కొత్త దారులు తెరిచే వ్యూహాన్ని అనుసరించారు.
ఇటీవల ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే (కల్కి) ని అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు సుకుమార్ - అల్లు అర్జున్ బృందం ప్రణాళికలు అమలు చేస్తోంది.
'పుష్ప 2' ప్రమోషన్స్ కోసం ఇటీవల చిత్రకథానాయకుడు అల్లు అర్జున్ 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం బెర్లిన్ (జర్మనీ) కి వెళ్లాడు. అక్కడ పుష్ప ప్రీమియర్ అయింది. ఓవైపు సుకుమార్ విరామం అన్నదే లేకుండా పుష్ప 2 చిత్రీకరణను పూర్తి చేస్తుంటే, అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ నుండి విరామం తీసుకొని తన నిర్మాత మైత్రి రవిశంకర్‌తో కలిసి బెర్లిన్‌కు వెళ్లాడు. అయితే బన్ని తన షూటింగును కూడా వదిలేసి ఈ వేడుకలకు ఎందుకు వెళ్లారు? అంటూ ఆరాలు మొదలయ్యాయి.
నిజానికి పుష్ప చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్రేజ్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు పుష్ప 2 కోసం ఆ క్రేజ్ ని ఎన్‌క్యాష్ చేయాలంటే సినిమా పండగల్లో ప్రముఖులతో రిలేషన్ షిప్ అవసరం. యూరప్ దేశాల్లో పాపులర్ డిస్ట్రిబ్యూటర్‌లను కనుగొని వారి స్వంత భాషలలో సినిమాకు మార్కెట్ చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సినిమా సంబరాల్లో ప్రముఖులతో స్నేహం దీనికి అన్ని విధాలా సహకరిస్తుందనడంలో సందేహం లేదు.
పుష్ప 2 చిత్రాన్ని దక్షిణాది బాషలతో పాటు హిందీలోను విడుదల చేయనున్నారు. దీంతో పాటు అమెరికా, బ్రిటిన్ సహా యూరప్ దేశాల్లో గల్ఫ్, ఐల్యాండ్ కంట్రీస్ లోను విడుదల చేయాలనేది ప్లాన్. రష్యన్ భాషలో పుష్ప విడుదలైంది కాబట్టి ఇప్పుడు పుష్ప 2 చిత్రాన్ని కూడా అక్కడ విడుదల చేసి బన్ని ముఖానికి మార్కెట్ విలువ పెంచుతారనే భావిస్తున్నారు. ఇక పుష్ప 2 చిత్రాన్ని చైనీ భాషల్లో విడుదల చేస్తారా లేదా? అన్నది వేచి చూడాలి.