పీవీఆర్ నిషేధంతో 'సలార్' ఓపెనింగులపై ఎఫెక్ట్?
ప్రఖ్యాత మల్లీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ లో `సలార్`ని ఆడించరు. పీవీఆర్ ని బాయ్ కాట్ చేసారు.
By: Tupaki Desk | 21 Dec 2023 4:04 AM GMTప్రఖ్యాత మల్లీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ లో `సలార్`ని ఆడించరు. పీవీఆర్ ని బాయ్ కాట్ చేసారు. ఆ మేరకు హోంబలే ప్రొడక్షన్స్ అధినేత కిరంగదూర్ సీరియస్ డెసిషన్ సంచలనంగా మారింది. ఉత్తరాదిన సలార్ రిలీజ్ విషయంలో పీవీఆర్ అవకతవకలు సహాయ నిరాకరణ దీనికి కారణమని తెలిసింది. నిజానికి డంకీతో సలార్ 50-50 శాతం ప్రాతిపదికగా థియేటర్లను షేరింగ్ చేసుకోవాలని ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి పీవీఆర్ కూడా అంగీకరించింది. కానీ ఉత్తరాదిన డంకీకి మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన పీవీఆర్ సలార్ కి అన్యాయం చేసింది. చాలా చోట్ల నియమాన్ని ఉల్లంఘించి డంకీని మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఇంచుమించు ఇదే తరహాలో మిరాజ్ సినిమాస్ తోను సలార్ బృందం సమస్యలు ఎదుర్కొంటోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్ - మిరాజ్ సినిమాస్ రెండిటినీ దక్షిణాదినా నిషేధిస్తున్నట్టు హోంబలే బ్యానర్ అధినేతలు ప్రకటించారు.
నిజానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాతిపదికన స్క్రీన్లను షేరింగ్ చేసుకునేందుకు సలార్ నిర్మాతలు న్యాయబద్ధంగా మంతనాలు సాగించారు. దీనికోసం కింగ్ ఖాన్ షారూఖ్ ని కూడా కలిసి మాట్లాడారు. కానీ పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం, మిరాజ్ సినిమాస్ ఓవరాక్షన్ హోంబలే నిర్మాతల కోపానికి కారణమైంది. ఉత్తరాది వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్లలో సలార్ ని ఆడనివ్వకుండా డంకీని వేస్తుండడంతో హోంబలే అధినేతలు సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. సలార్ ని కేవలం ఉత్తరాదిన మాత్రమే కాదు.. ఇటు దక్షిణాదినా పీవీఆర్ ప్రాపర్టీస్, మిరాజ్ సినిమాస్ లో ఆడించలేమని ప్రకటించారు. యాజమాన్యం అవకతవకలను అన్ ఫెయిర్ ప్రాక్టీస్ అని వ్యాఖ్యానిస్తూ ఇది సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
అయితే మేకర్స్ తీసుకున్న నిర్ణయంతో సలార్ ఓపెనింగులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ఉత్తరాది వ్యాప్తంగా కీలకమైన పీవీఆర్ స్క్రీన్లలో సలార్ ఆడదు. అలాగే దక్షిణాదినా 50 శాతం స్క్రీన్లను కలిగి ఉన్న పీవీఆర్ ఐనాక్స్ ని నిషేధించడంతో ఆ మేరకు కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇది సలార్ ఓపెనింగుల రికార్డులను ప్రభావితం చేస్తుందనే ఆందోళన నెలకొంది. ప్రభాస్ నటించిన ఫ్లాప్ సినిమాలు సైతం ఇలాంటి వివాదాలు లేని సమయంలో సాఫీగా రిలీజై భారీ ఓపెనింగులు తెచ్చాయి. కానీ ఇప్పుడు సలార్ కి భారీ బజ్ ఉన్నా కానీ ఓపెనింగుల రికార్డులు నమోదు చేయలేని పరిస్థితి తలెత్తొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ వారాంతంలో సలార్ భారీ వసూళ్లతో సంచలనం సృష్టించడం ఖాయమని అంచనా. డంకీతో పోలిస్తే ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్స్ లో సలార్ బుకింగుల హవా అసాధారణంగా ఉందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.