మైఖేల్ జాక్సన్ 'థ్రిల్లర్' స్వరకర్త మృతి
జోన్స్ ప్రచారకర్త అందించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లోని బెల్ ఎయిర్ సెక్షన్‌లోని తన ఇంటిలో అతడు మరణించాడని తెలిపాడు.
By: Tupaki Desk | 4 Nov 2024 5:39 PM GMTపాప్ సామ్రాజ్యపు రారాజు మైఖేల్ జాక్సన్ సహా హాలీవుడ్ లో దిగ్గజ స్టార్లతో పని చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు క్విన్సీ జోన్స్ తన 91వ ఏట మరణించారు. మైఖేల్ జాక్సన్ చారిత్రాత్మక 'థ్రిల్లర్' ఆల్బమ్‌ను రూపొందించిన అతడు కెరీర్ లో ఎన్నో చార్ట్ బస్టర్ పాటలకు సంగీతం అందించారు. సినిమా, టీవీ రంగాల్లో అతడు ఒక వేవ్. ఫ్రాంక్ సినాట్రా, రే చార్లెస్ సహా వందలాది మంది ఇతర రికార్డింగ్ కళాకారులతో కలిసి పని చేసిన ప్రముఖుడు క్విన్సీ. అతడు మల్టీ-టాలెంటెడ్ మ్యూజిక్ టైటాన్ గా కీర్తిని పొందాడు.
జోన్స్ సర్కిల్ అసాధారణమైనది. దేశాధ్యక్షులు, విదేశీ నాయకులు, సినీ తారలు, సంగీతకారులు, వ్యాపార దిగ్గజాలతో సహవాసం కొనసాగించిన మేటి ఘనుడు. రూట్స్, ఇన్ ది హీట్ ఆఫ్ ది నైట్ సహా ఎన్నో హిట్ ట్రాక్ లకు సౌండ్‌ట్రాక్‌లను కంపోజ్ చేశాడు. అమెరికా దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ మొదటి ప్రారంభోత్సవ వేడుకకు అతడే సంగీతం అందించాడు.
జోన్స్ ప్రచారకర్త అందించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లోని బెల్ ఎయిర్ సెక్షన్‌లోని తన ఇంటిలో అతడు మరణించాడని తెలిపాడు. జోన్స్ ఈ నెలలో గౌరవ అకాడమీ అవార్డును అందుకోవాల్సి ఉంది. అతడి మరణ సమయంలో కుటుంబ సభ్యులు అతడి చుట్టూ ఉన్నారు. ''ఇది మా కుటుంబానికి నమ్మశక్యం కాని నష్టం .. అతడిలా గొప్ప జీవితాన్ని ఎవరూ సాధించలేరు. అతనిలాంటి మరొకరు ఉండరని తెలుసు'' అని కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారు.
జోన్స్ చికాగో సౌత్ సైడ్‌లో ముఠాలతో కెరీర్ ప్రారంభించి, నగరాలలో మ్యూజిక్ ప్రదర్శన వ్యాపారంలో చాలా ఎత్తుకు ఎదిగాడు. హాలీవుడ్‌లో అభివృద్ధి చెందిన మొదటి నల్లజాతి కార్యనిర్వాహకులలో ఒకడు అయ్యాడు. అమెరికన్ స్టైల్ రిథమ్ తో పాటకు కొన్ని గొప్ప క్షణాలను ఆపాదించేందుకు అసాధారణ సంగీత కేటలాగ్‌ను సేకరించిన ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.