రాధ కుమార్తె కార్తీక పెళ్లిలో మెగా సందడి
నాలుగు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో అవకాశాలు అందుకున్న యువనాయికల్లో కార్తీక నాయర్ ఒకరు. జోష్, రంగం వంటి సినిమాలతో తెలుగు వారికి కార్తీక సుపరిచితురాలు.
By: Tupaki Desk | 20 Nov 2023 4:36 AM GMTనాలుగు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో అవకాశాలు అందుకున్న యువనాయికల్లో కార్తీక నాయర్ ఒకరు. జోష్, రంగం వంటి సినిమాలతో తెలుగు వారికి కార్తీక సుపరిచితురాలు. ఆరంభ్ అనే హిందీ సీరియల్‌లో కూడా నటించింది. రాధ కుమార్తెగా కెరీర్ ప్రారంభించినా కానీ ఆ ఇమేజ్ తనకు ఎంతమాత్రం కలిసి రాలేదు. కార్తీక గత 6 సంవత్సరాలుగా ప్రజల దృష్టి నుండి అదృశ్యమైంది. సినిమాలకు దూరమైంది. దీంతో కార్తీక నటనకు స్వస్తి పలికిందని ప్రచారమైంది. కార్తీక ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. కానీ ఏదైనా సినిమా లేదా టీవీ షో వల్ల కాదు.
ఇటీవలే దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు సహా పలువురు తెలుగు సినీప్రముఖులకు శుభలేఖలు పంచుతూ హైదరాబాద్ లో సందడి చేసారు నటి రాధ. ఆ సమయంలో తన కుమార్తె కార్తీక పెళ్లి కబురు వింటున్నామని అంతా ఊహించారు. ఇంతలోనే ఇప్పుడు రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు అగ్ర తమిళ హీరోలు కనిపించారు. స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో ప్రముఖ నటులు కె. భాగ్యరాజ్, ఆయన భార్య మాజీ నటి పూర్ణిమ భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, రేవతి, సుహాసిని మణిరత్నం తదితరులు కొత్త జంటన ఆశీర్వదించారు. నటి రాదికా శరత్‌కుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర తారల సందడికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసారు. అయితే అంతకుముందు రోజు శ్రీపద్మనాభస్వామి ఆలయాన్ని చిరంజీవి సందర్శించినప్పటి ఫోటోలు కూడా రివీలయ్యాయి.
రాధ కుమార్తె కార్తీక నాయర్ గత నెలలో రోహిత్ మీనన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. కార్తీక ఇటీవల షేర్ చేసిన ఫోటోతో పెళ్లి కొడుకు ఎవరో స్పష్ఠత వచ్చింది. కార్తీక భర్త పేరు రోహిత్ మోహన్. కార్తీక నాయర్ ఒకప్పటి నటి రాధ- రాజశేఖరన్ నాయర్‌లకు జన్మించారు. నాగ చైతన్య సరసన జోష్‌తో సినిమా ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెట్టింది. కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన కో చిత్రంతో కార్తీక నాయర్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇందులో కార్తీక జీవాతో కలిసి నటించింది. రంగం విజయం కార్తీకకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది. పురంపోక్కు ఎంగిర పొదువుడమై- భారతిరాజా అన్నకొడియుం కొడివీరనుమ్‌లో ఆర్య సరసన నాయికగా నటించింది. 2015లో సినిమా నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, కార్తీక 2017లో స్టార్ ప్లస్ నిర్మాణంతో టెలివిజన్ తెరపైకి తిరిగి వచ్చింది. దీనికి గోల్డీ బెహ్ల్ కర్త. వి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందించారు. ఈ సిరీస్‌లో కార్తీక రజనీష్ దుగ్గల్‌తో కలిసి నటించింది. యోధ రాణి దేవసేన పాత్రలో కార్తీక మెప్పించింది. ప్రజలు - విమర్శకులు తన నటనను ప్రశంసించారు. అయినా ఆ తర్వాత కార్తీక సినిమాలు లేదా సీరియల్స్‌లో కనిపించలేదు. ముంబై ప్రధాన కార్యాలయం నుండి తన కుటుంబానికి చెందిన విలాసవంతమైన హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది