కారవ్యాన్‌లో రహస్య కెమెరాలతో వీడియోలు తీసారు: రాధిక శరత్ కుమార్
ఇప్పుడు వెటరన్ నటి రాధిక శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేసారు.
By: Tupaki Desk | 31 Aug 2024 9:39 AM GMTమాలీవుడ్‌పై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక ప్రకంపనాలు ఇప్పట్లో ఆగేట్టు లేవు. చాలామంది నటీమణులు తమకు ఎదురైన వేధింపుల ప్రహసనం గురించి ఓపెనయ్యారు. ఆన్ లొకేషన్ తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో, ఎలాంటి దుశ్చర్యలను తాము ఎదుర్కోవాల్సి వచ్చేదో కూడా వెల్లడించారు. ఇప్పుడు వెటరన్ నటి రాధిక శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేసారు.
మలయాళ సినిమా సెట్లలో నటీమణుల క్యారవాన్లలో రహస్య కెమెరాలు ఉపయోగించారని రాధికా శరత్‌కుమార్ ఆరోపించారు. రహస్య కెమెరాలతో మహిళా నటీనటుల అభ్యంతరకర వీడియోలు రికార్డయ్యాయని, మగ నటులు తమ మొబైల్ ఫోన్‌లలో దానిని వీక్షించడాన్ని తాను స్వయంగా చూశానని రాధికా శరత్‌కుమార్ ఆశ్చర్యకరమైన వాదనలు వినిపించారు.
జస్టిస్ కె హేమ కమిటీ నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో పాపులర్ మలయాళ ఛానెల్ తో మాట్లాడుతూ సీనియర్ నటి రాధిక చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనికి RMP నాయకురాలు, ఎమ్మెల్యే K K రెమా సహా రాష్ట్రంలోని వివిధ వర్గాల నుండి తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి.
మ కమిటీ నివేదిక ఎందుకు ఆలస్యంగా రిలీజ్ చేసారు? అంటూ రాధిక ఆశ్చర్యపోయారు. మలయాళ పరిశ్రమ మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలలో కూడా మహిళలపై వేధింపులు, అసభ్యకరమైన ప్రవర్తనలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, రాధిక శరత్‌కుమార్ ఒక మలయాళ చిత్రం షూటింగ్ సెట్‌లో ఆడవారి కారవాన్‌లలో రహస్య కెమెరాలను ఉపయోగించి క్యాప్చర్ చేసిన నటీమణుల క్లిప్‌లను మేల్ ఆర్టిస్టులు చూడటం తాను చూశానని చెప్పారు. క్యారవాన్లలో మహిళలు బట్టలు మార్చుకునే వీడియోలను నేను చూశాను అని రాధిక ఛానెల్‌తో అన్నారు.
అయితే సినిమా పేర్లు లేదా అక్రమ వీడియోలను చూస్తున్న నటీనటుల పేర్లు, ఇతర వివరాలను వెల్లడించడానికి రాధిక ఇష్టపడలేదు. వాహనాల్లో రహస్య కెమెరాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కారవాన్‌ల బాధ్యులపై హెచ్చరించిన విషయాన్ని కూడా రాధిక గుర్తు చేసుకున్నారు. నేను చాలా కోపంగా ఉన్నాను. సెట్లో మహిళలు సురక్షితంగా ఉండాలని పట్టుబట్టాను. కారవాన్ వద్దు అని చెప్పి, నా హోటల్ గదికి తిరిగి వెళ్ళాను! అని రాధిక వెల్లడించారు.
హేమ కమిటీ నివేదికపై ఇండస్ట్రీలోని మేల్ నటులు మౌనంగా ఉన్నారని రాధిక ఆవేదన కనబరిచారు. ఇప్పుడు బాధ్యత మహిళలపై ఉంది. తమను తాము రక్షించుకునే బాధ్యతను వారు భుజాన వేసుకోవాలి అని అన్నారు. రాధిక శరత్‌కుమార్ ప్రకటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆర్‌ఎంపీ నాయకురాలు కెకె రెమా, సినీ పరిశ్రమలో జరుగుతున్న క్రూరత్వాలు ఎవరి ఊహకు అందవని అన్నారు. ఇది ఎలాంటి క్రూరత్వం.. సినిమా ప్రపంచం అతి పెద్ద అండర్ వరల్డ్ గా మారుతోంది.. ఈ ఆరోపణలన్నింటిని చూస్తే ఇది మనకు అర్థమవుతోంది! అని ఆమె మీడియాతో అన్నారు. సాధారణంగా సినీ పరిశ్రమలోని మహిళలు కారవాన్ సురక్షితం అని నమ్ముతారని, పురుషుల మాదిరిగానే వారికి కూడా అలాంటి సౌకర్యాలు లభిస్తే షూటింగ్ లొకేషన్‌లలో సురక్షితంగా ఉండవచ్చని రెమా అన్నారు. కానీ తాజా అభియోగం అది తప్పు అని రుజువు చేసిందని వ్యాఖ్యానించారు.
ప్రఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి నేరం గురించి తెలిసినా కూడా ఇన్నాళ్లు ఈ విషయంపై రాధికా శరత్‌కుమార్ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. ప్రముఖ స్క్రీన్ రైటర్ డీడీ దామోదరన్ మీడియాతో మాట్లాడుతూ, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో వేధింపులపై జస్టిస్ కె హేమ కమిటీ నివేదికను ప్రచురించడం వల్ల పరిశ్రమలో డొల్ల అంతా బయటపడింది. మేడి పండు నుంచి పురుగులు బయటపడుతున్నాయి. ఈ తరహా ఆరోపణల మధ్య, జస్టిస్ హేమా కమిటీ నివేదిక ప్రచురించిన అనంతరం వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత చాలా మంది నటీనటులు, దర్శకులపై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి.