రహస్య కెమెరా ఘటన.. అగ్ర హీరో ఫోన్ చేశారన్న సీనియర్ నటి
హేమ కమిటీ నివేదిక ప్రకంపనల్లో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఆరోపణలు మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి.
By: Tupaki Desk | 4 Sep 2024 9:30 AM GMTహేమ కమిటీ నివేదిక ప్రకంపనల్లో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఆరోపణలు మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. సినిమా సెట్లలో, కారవ్యాన్‌లలో అభద్రతను రాధిక ఆరోపణలు బట్టబయలు చేసాయి.
నటి రాధిక శరత్‌కుమార్ ఇటీవల సినిమా సెట్‌లో రహస్య కెమెరాకు సంబంధించి తనకు జరిగిన అనుభవంపై ఆరోపిస్తూ బహిరంగంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై స్పష్టత కోసం కేరళకు చెందిన దర్యాప్తు బృందం తనను సంప్రదించిందని వెల్లడించారు. తమిళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న దోపిడీకి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి .., దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిటీ అవసరం గురించి కూడా రాధిక మాట్లాడారు.
అయితే తన సినిమా సెట్‌లో అలాంటి సంఘటన జరిగిందా? అని అడగడానికి మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్ తనకు ఫోన్ చేసారని రాధిక పేర్కొన్నారు. ఘటన జరిగినప్పుడు లొకేషన్‌లో పెద్ద నటీనటులెవరూ లేరని, సెట్‌లో ఉన్నవారు రహస్య కెమెరా రికార్డింగ్‌లను కనుగొన్న తర్వాతే పరిస్థితి గురించి తనకు తెలిసిందని రాధిక స్పష్టం చేసారు. రాధిక ఈ సమస్యను హైలైట్ చేసారు. నిర్మాణ సంస్థ అధికారులను తాను అభ్యర్థించానని తెలిపారు.
గత సంఘటనలను ఇప్పుడే చెప్పాలనే తన నిర్ణయానికి సంబంధించిన విమర్శలపై కూడా రాధిక స్పందించారు. నేను సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఎందుకు చర్చించి వివాదానికి కారణమవుతున్నాను అని కొందరు ప్రశ్నించారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న వేధింపులపై నేను ఇప్పటికే స్పందించాను. అనవసరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నించడం లేదు. నేను చట్టపరమైన చర్య తీసుకోను.. అని కూడా అన్నారు. ఇదిలా ఉండగా రహస్య కెమెరా ఘటన విషయంలో తాను కేకలు వేసానని రాధిక అన్నట్టు ప్రముఖ మీడియాలో కథనాలు రావడంపైనా చర్చ సాగుతోంది. ఆ ఘటన తర్వాత తాను నిర్మాతలను సంప్రదించినట్టు కూడా రాధిక వెల్లడించారని సదరు కథనం పేర్కొంది. హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయిన అనంతరం మోహన్ లాల్ `అమ్మా`(మలయాళ ఆర్టిస్టుల సంఘం) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బాధ్యత వహిస్తూ లాల్ ప్యానెల్ సభ్యులంతా రాజీనామాలు సమర్పించారు.
పరిశ్రమలో సమస్యలపై స్పందిస్తూ దోపిడీని ఎదుర్కోవడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తమిళ చిత్ర పరిశ్రమ `నడిగర్ సంఘం` ప్రధాన కార్యదర్శి విశాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నటుడు అర్జున్ సైతం స్పందిస్తూ..కమీషన్లతో సంబంధం లేకుండా సమిష్టి కృషి ద్వారా పరిశ్రమ వ్యక్తులే ఈ వేధింపుల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించగలమని పేర్కొన్నారు.