Begin typing your search above and press return to search.

డైరెక్షన్‌ మొదలు పెట్టిన హీరోయిన్‌!

2005లో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాధిక తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   8 March 2025 2:00 AM IST
డైరెక్షన్‌ మొదలు పెట్టిన హీరోయిన్‌!
X

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. సినిమాలతోనే కాకుండా ఈమె వివాదాస్పద అంశాలతో, అందమైన ఫోటో షూట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా రాధిక ఆప్టే అలరించింది. 2005లో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాధిక తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. కేవలం ఇండియన్ మూవీస్‌లోనే కాకుండా హాలీవుడ్‌ సినిమాలు, విదేశీ సినిమాల్లోనూ నటించిన రాధిక ఆప్టే తన కొత్త జర్నీని మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది.

తెలుగులో బాలకృష్ణతో లెజెండ్‌, లయన్‌ సినిమాల్లో నటించడంతో పాటు కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలోనూ నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. సినిమాలు, సిరీస్‌లతో రెగ్యులర్‌గా ప్రేక్షకులను అలరిస్తూ, నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రాధిక ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీకి సిద్ధం అయింది. ఇప్పటికే ఈమె దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. రాధిక ఆప్టే దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. కానీ సినిమా అధికారిక ప్రకటన మాత్రం నిర్మాణ సంస్థ నుంచి వచ్చింది.

సినీవీ-సీహెచ్‌డీ బ్యానర్‌లో విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తున్న 'కోట్యా' సినిమాకు రాధిక ఆప్టే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా దృవీకరించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న కోట్యా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ పూర్తి అయిందని, త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను వెళ్లడిస్తామంటూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మొత్తానికి వివాదాల నటి రాధిక ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్‌ అయింది. మొదటి సినిమానే యాక్షన్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకోవడం సాహసం అని చెప్పాలి.

రాధిక ఆప్టే 2005లో వాహ్! లైఫ్ హో తో ఐసి అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులకు పరిచయం అయింది. తెలుగులో రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో చక్కని నటనతో మెప్పించింది. అంతే కాకుండా తెలుగులో ధోనీ సినిమాలోనూ నటించి ఆకట్టుకుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పలు పాత్రల్లో నటించడం ద్వారా రాధిక ఆప్టే పలు సార్లు నటిగా మంచి పేరును సొంతం చేసుకుంది. గతంలోనే దర్శకురాలిగా సినిమాను చేస్తానంటూ ప్రకటించిన రాధిక ఆప్టే అన్నట్లుగానే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. నటిస్తూనే దర్శకత్వం అనేది రెండు పడవల ప్రయాణం వంటిది. మరి ఈ ప్రయాణంను రాధిక ఎలా హ్యాండిల్‌ చేస్తుంది అనేది చూడాలి.