9 ఏళ్ల తర్వాత.. నిజంగానే చిరు అడిగారా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 3 July 2024 9:58 AM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇంకా సమయం చాలానే ఉన్నా షూటింగ్ మాత్రం స్పీడ్ గా జరుగుతోంది.
త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, మరో అర డజను ముద్దుగుమ్మలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. వారి పాత్రల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ వారిలో ఎక్కువ శాతం మంది చిరంజీవికి చెల్లి పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమా కథ విషయమై కూడా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వాటన్నింటిని పక్కన పెడితే ఈ సినిమాలోని ఒక మాస్ మసాలా సాంగ్ కి రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ అందించబోతున్నాడట. 9 ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 లోని రత్తాలు రత్తాలు పాటకు లారెన్స్ కొరియోగ్రఫీ అందించిన విషయం తెల్సిందే. ఆ పాట తో పాటు డాన్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత చిరంజీవి నుంచి వచ్చిన సినిమాల్లో ఏ ఒక్క పాటకు కూడా లారెన్స్ తో కొరియోగ్రఫీ చేయించలేదు. అది ఎందుకు అనేది క్లారిటీ లేదు కానీ, 9 ఏళ్ల తర్వాత చిరంజీవి విశ్వంభర సినిమాలోని ఒక పాటకు కొరియోగ్రఫీ చేసే బాధ్యత లారెన్స్ కి దక్కింది.
స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి మరీ విశ్వంభర పాట కోసం కొరియోగ్రఫీ చేయమని అడిగారు అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అయితే కొందరు మెగా కాంపౌండ్ కి చెందిన వారు మాత్రం ఆఫ్ ది రికార్డ్ గా దర్శకుడు లేదా నిర్మాత నుంచి లారెన్స్ కి ఫోన్ కాల్ వెళ్లి ఉంటుందని అంటున్నారు.
ఏది ఏమైనా విశ్వంభర సినిమాలోని ఒక పాట కోసం లారెన్స్ కొరియోగ్రఫీ చేయడం కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా, నటుడిగా ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా చిరంజీవి సినిమా అంటే లారెన్స్ కచ్చితంగా ల్యాండ్ అవ్వడం ఖాయం. కనుక కచ్చితంగా ఈ పాట కూడా రత్తాలు రత్తాలు స్థాయిలో మాస్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.