విడాకుల తర్వాత చనిపోవాలనిపించింది!
ఇటీవల ఈయన విశ్వక్ సేన్ హీరోగా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెకానిక్ రాకీ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు.
By: Tupaki Desk | 27 Nov 2024 4:34 AM GMTఇటీవల సినిమాలో ఎక్కువగా కనిపిస్తున్న నటుడు రఘురామ్. ఇటీవల ఈయన విశ్వక్ సేన్ హీరోగా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెకానిక్ రాకీ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. ఈ తరం విలన్ పాత్రలకు బాగా సెట్ అవుతున్న రఘురామ్ వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్లో భాగంగా రఘురామ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తన విడాకులు, ప్రస్తుత తన రిలేషన్ గురించి రఘురామ్ చెప్పిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
పలు టీవీ షోల్లో కనిపించిన రఘురామ్ టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు దక్కించుకున్నాడు. ఇటీవల ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన మొదటి జీవిత భాగస్వామి నుంచి విడాకులు తీసుకోవడం అనేది జీవితంలో చాలా బాధ పెట్టింది. ఆ సమయంలో మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేసింది. తాను ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లి పోయాను. తాను మళ్లీ మామూలు మనిషిని కావడం అసాధ్యం అని అనుకున్నాను. తన కెరీర్ పూర్వ వైభవం సాధించడం కష్టం అని చాలా మంది అనుకున్నారు. కానీ నా కొత్త జీవిత భాగస్వామితో అది సాధ్యం అయిందని రఘు రామ్ అన్నాడు.
విడాకులు తీసుకున్న సమయంలో మానసికంగా కృంగి పోయాను, ఒకానొక సమయంలో చనిపోవాలి అనిపించింది. కానీ జీవితంలో ముందడుగు వేయాలనే ఉద్దేశ్యంతో సన్నిహితుల ప్రోత్సాహంతో కొత్త జీవితం మొదలు పెట్టాను. ప్రస్తుతం తన మొదటి భాగస్వామితో చాలా స్నేహంగా ఉంటున్నాను, అంతే కాకుండా ఆమె కూడా తనతో చాలా స్నేహంగా ఉంటుంది అన్నాడు. ప్రస్తుత భాగస్వామి నటాలీతో చాలా సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్నట్లుగా చెప్పాడు. బంధాలు బలంగా ఉన్నప్పుడు ఇతరుల ప్రభావం తక్కువగా ఉంటుంది అంటూ ఆసక్తికర వ్యాక్యలు చేశాడు.
తన గురించి ఇండస్ట్రీలో తప్పుడు ప్రచారం ఉండటంతో నటాలీకి చెందిన ఫ్యామిలీ పెళ్లికి మొదట అంగీకరించలేదు. కానీ చివరకు వారిని ఒప్పించడంలో సక్సెస్ అయ్యాను అని అన్నాడు. జీవితంలో ప్రస్తుతం సంతోషకమైన క్షణాలు గడుపుతున్నట్లు రఘురామ్ అన్నాడు. టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర భాషల నుంచి సినిమా ఆఫర్లు వస్తే తప్పకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆధరిస్తున్నారని రఘురామ్ పేర్కొన్నాడు.