భార్యకు విడాకులు.. AR రెహమాన్ ఎమోషనల్
దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో ఇప్పుడిలా విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ జంట భావోద్వేగానికి లోనయ్యారు.
By: Tupaki Desk | 20 Nov 2024 4:00 AM GMTఆస్కార్ విజేత, స్వరకర్త AR రెహమాన్ నుంచి విడిపోతున్నట్టు భార్య సైరా భాను ఈ మంగళవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో ఇప్పుడిలా విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ జంట భావోద్వేగానికి లోనయ్యారు. తన భార్య ప్రకటన అనంతరం రెహమాన్ ఎమోషనల్ అయ్యారు. బుధవారం తెల్లవారుజామున X (గతంలో ట్విట్టర్)ఖాతాలో ఆయన ఒక నోట్ రాసారు. గ్రాండ్ థర్టీకి చేరుకోవాలని ఆశించామని కానీ ఈ బ్రేకప్ ని ప్రకటించాల్సి వచ్చిందని కూడా అన్నారు. ఇది 'కఠినమైన అధ్యాయం' అని ఎమోషనల్ అయ్యారు. ఈ బ్రేకప్ లోను మేము అర్థాన్ని వెతుకుతాము అని రాసారు.
AR రెహమాన్ భార్య సైరా బాను 29 సంవత్సరాల వివాహం తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట 1995లో వివాహం చేసుకున్నారు. విడిపోయిన తర్వాత AR రెహమాన్ ఎమోషనల్ నోట్ సారాంశం ఇలా ఉంది. ''మేము ముప్పైకి చేరుకోవాలని ఆశించాము.. కానీ అది జరగలేదు. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా ఒణుకుతోంది. అయినా కానీ ఈ విధ్వంసంలో మేం అర్థాన్ని వెతుకుతున్నాము. మమ్మల్ని అర్థం చేసుకున్న స్నేహితులకు మా గోప్యతను గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు'' అని రాసారు. ఈ బ్రేకప్ ని #ARR సైరా బ్రేకప్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జోడించాడు. ఖతీజా, ఆమెన్ కూడా గోప్యతను గౌరవించాలని కోరారు. వారి కుమార్తె ఖతీజా రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇలా రాశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యతతో గౌరవంగా పరిగణించగలిగితే నేను చాలా అభినందిస్తాను. మీ పరిశీలనకు ధన్యవాదాలు.. అని రాసారు.
AR రెహమాన్ - సైరా దంపతుల కుమారుడు అమీన్ కూడా తన ఇన్‌స్టాలో 'గోప్యత'ను గౌరవించాలని అభ్యర్థించారు. AR రెహమాన్- సైరా 1995లో వివాహం చేసుకున్నారు. ఖతీజా, రహీమా, అమీన్ వారి పిల్లలు. మంగళవారం విడిపోవాలనుకున్న జంట తరపున ఒక ప్రకటనలో న్యాయవాది వందనా షా మాట్లాడుతూ -''తమ సంబంధంలో తట్టుకోలేని మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నార''ని చెప్పారు. ఒకరిపై ఒకరికి ఘాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఈ జంట ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని కనుగొన్నట్టు తెలిపారు. అనంతరం సైరా బాను విడిపోతున్నట్లు మొదట ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత జంటగా ఉమ్మడి ప్రకటన చేశారు.