క్రియేటివిటీ పేరుతో 2 AM రమ్మన్నాడు.. గాయకుడి ఆవేదన..
ఇప్పుడు స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ తో తనకు ఎదురైన చిక్కుల గురించి అతడు వెల్లడించారు.
By: Tupaki Desk | 3 Jan 2025 10:30 PM GMTసీనియర్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య ఇటీవల కొన్ని వివాదాస్పద అంశాలతో మీడియాలో చర్చగా మారారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ సహా పలువురితో తన వివాదాల గురించి అతడు మాట్లాడారు. ఇప్పుడు స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ తో తనకు ఎదురైన చిక్కుల గురించి అతడు వెల్లడించారు.
అభిజీత్ బాలీవుడ్ లో పాపులర్ నేపథ్య గాయకులలో ఒకరు. 1000 కంటే ఎక్కువ చిత్రాలలో 6000 పాటలకు తన గాత్రాన్ని అందించారు. అతడు కునాల్ సింగ్ - సోనాలి బింద్రే నటించిన 'దిల్ హి దిల్ మే' చిత్రం కోసం AR రెహమాన్ స్టూడియోస్ లో 'ఏ నజ్నీన్ సునో నా' పాటను రికార్డ్ చేశాడు. అయితే రికార్డింగ్ సమయంలో రెహమాన్ తనను సృజనాత్మకత పేరుతో ఎలాంటి చిక్కుల్లోకి నెట్టారో వెల్లడించాడు.
అసలు రెహమాన్ సృజనాత్మక విధానం ఏమిటో తనకు అర్థం కాలేదని అన్నాడు. ఓ మీడియా ఇంటర్వ్యూలో, అభిజీత్ భట్టాచార్య రెహమాన్ తో ఒకే ఒక్కసారి మాత్రమే పని చేయగలిగానని తెలిపాడు. అపట్లో తాను క్షణం తీరిక లేని బిజీ గాయకుడిని అని.. కానీ రెహమాన్ తనను స్టూడియో వద్ద వెయిట్ చేయించాడని అన్నారు. అను మాలిక్, ఆనంద్-మిలింద్, జతిన్-లలిత్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల నుండి తనకు చాలా డిమాండ్ ఉందని అతడు తెలిపాడు. తన షెడ్యూల్ డబ్బింగ్ సెషన్స్‌తో బిజీగా ఉంది. అలాంటి క్లిష్ఠ సమయంలో రెహమాన్‌ని కలవడానికి వెళ్ళాడు. కానీ హోటల్ వద్ద వేచి చూడాల్సి వచ్చింది. రెహమాన్ కోసం వేచి ఉండలేని పరిస్థితి ఉందని అభిజీత్ అన్నాడు. తెల్లవారుజామున 2 గంటలకు స్టూడియోకి పిలిపిస్తూ కాల్ వచ్చింది. ఆశ్చర్యపోయాను.. ఉదయాన్నే వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. కానీ తాను స్టూడియోకి వెళ్లినప్పుడు AR రెహమాన్ అక్కడ లేరు. సాధారణ పని వేళలలో రెహమాన్ పని చేయడు. నాకు సాధారణ పనివేళల్లో పని చేసే అలవాటు ఉంది. నేను క్రమపద్ధతిలో పనిచేయడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు సృజనాత్మకత పేరుతో 3:33 గంటలకు రికార్డింగ్ చేయాలని చెబితే అదేంటో నాకు అర్థం కాలేదు అని అతడు అన్నాడు. తాను స్టూడియోకి వచ్చినప్పుడు రెహమాన్ అసిస్టెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడని అభిజీత్ తెలిపాడు.
రెహమాన్ స్టూడియోలో వేచి ఉండమని సలహా ఇచ్చినప్పుడు నాకు ఇతరులకు పని చేయాల్సిన కమిట్ మెంట్లు ఉన్నాయి. అందువల్ల అతడి కోసమే ఎక్కువసేపు ఉండలేను.. అని కూడా తెలిపాడు. ఏసీ పడకపోయినా జలుబు కండిషన్ లో కూడా కొన్నిటిని వదులుకుని పని చేసానని కూడా అభిజీత్ వెల్లడించారు.