Begin typing your search above and press return to search.

రెహమాన్‌కి మరో అత్యున్నత పురస్కారం

ఆయన తరపున ది గోట్‌ లైఫ్‌ సినిమా దర్శకుడు బ్లెస్సీ ఆ అవార్డును అందుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2024 7:09 AM GMT
రెహమాన్‌కి మరో అత్యున్నత పురస్కారం
X

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కి మరో అంతర్జాతీయ స్థాయి అత్యున్నత పురస్కారం లభించింది. హాలీవుడ్‌ మ్యూజిక్‌ ఇన్‌ మీడియా అవార్డ్స్‌లో ఏఆర్‌ రెహమాన్‌కి పురస్కారం లభించింది. 'ది గోట్‌ లైఫ్‌' సినిమాకు గాను ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించినందుకు గాను రెహమాన్‌కి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ అవార్డు వేడుకలో రెహమాన్ పాల్గొనలేక పోయారు. ఆయన తరపున ది గోట్‌ లైఫ్‌ సినిమా దర్శకుడు బ్లెస్సీ ఆ అవార్డును అందుకున్నారు. విదేశీ భాషా చిత్రం విభాగంలో ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును సొంతం చేసుకున్న ఏఆర్‌ రెహమాన్‌కి అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు దక్కతున్నాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్‌, అమలా పాల్‌ ఇంకా ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమాకి బ్లెస్సీ దర్శకత్వం వహించగా తెలుగులో మైత్రి మూవీ మేకర్స్‌ వారు విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ పదుల కొద్ది కేజీల బరువు తగ్గడంతో పాటు, ఏడారిలోని సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. చాలా నేచురల్‌గా ఉన్న సన్నివేశాలకు సంగీత దర్శకుడు రెహమాన్ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా విడుదల సమయంలోనే రెహమాన్‌ నేపథ్య సంగీతంకు విమర్శకుల ప్రశంసలు దక్కిన విషయం తెల్సిందే.

ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్న ఏఆర్‌ రెహమాన్‌ ఇప్పుడు ఈ అంతర్జాతీయ అవార్డును సైతం అందుకోవడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా రెహమాన్‌పై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. రెహమాన్‌ గత కొన్ని రోజులుగా విడాకుల వార్తలతో మీడియాలో ఉంటున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో ఆయనకు ఇలాంటి అరుదైన అవార్డు రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ వైవాహిక జీవితాన్ని విడాకులతో తెంపుకోవడం పట్ల కొందరు రెహమాన్‌ పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అవార్డు రావడం ఆయనకు కాస్త ఊరట కలిగించే విషయంగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ది గోట్‌ లైఫ్‌ సినిమా బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ కి అవార్డు రావడం పట్ల రెహమాన్ స్పందిస్తూ సినిమాను చాలా నేచురల్‌గా రూపొందించిన దర్శకుడు బ్లెస్సీకి అభినందనలు అన్నారు. అంతే కాకుండా ఈ అవార్డును ఇచ్చిన జ్యూరీ మెంబర్స్‌కి రెహమాన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం రెహమాన్‌ పలు బాలీవుడ్‌ సినిమాలతో పాటు తెలుగులో రామ్‌ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో తెలుగు లో మరిన్ని సినిమాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.