Begin typing your search above and press return to search.

అప్పుడు రజనీ.. ఇప్పుడు ప్రభాస్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో "ది రాజాసాబ్" సినిమా తెరకెక్కుతోంది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 5:08 AM GMT
అప్పుడు రజనీ.. ఇప్పుడు ప్రభాస్!
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో "ది రాజాసాబ్" సినిమా తెరకెక్కుతోంది. హారర్‌ అన్నది న్యూ హ్యూమర్ అంటూ డార్లింగ్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన మోషన్ పోస్టర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మునుపెన్నడూ చూడని విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కొత్త అవతార్ లో కనిపించి ప్రభాస్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ లుక్ బయటకు వచ్చిన తర్వాత 'చంద్రముఖి', 'నాగవల్లి' సినిమాలతో కంపేర్ చేస్తూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్ లో "ది రాజాసాబ్" సినిమా రూపొందుతోందని క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారి హారర్‌ కథలో నటిస్తుండంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హారర్ కామెడీ జానర్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే సినిమా ''చంద్రముఖి''. సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు పి.వాసు కాంబోలో తెరకెక్కిన సినిమా ఇది. 'మణిచిత్రతాజు' అనే మలయాళ మూవీ ఆధారంగా రూపొందిన కన్నడ చిత్రం 'ఆప్తమిత్ర'కు రీమేక్ గా రూపొందింది.

2005 లో వచ్చిన 'చంద్రముఖి' చిత్రం తమిళ తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత 2010లో విక్టరీ వెంకటేశ్, పి.వాసు కలయికలో 'నాగవల్లి' అనే సినిమా వచ్చింది. ఇది చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా పేర్కొనబడింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో రజనీకాంత్, వెంకీల లుక్స్ తో 'ది రాజా సాబ్‌'లో ప్రభాస్‌ లుక్ కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని ఓ వర్గం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు మారుతి ప్రభాస్‌తో చంద్రముఖి, నాగవల్లి తరహా చిత్రాన్ని రూపొందిస్తున్నాడా అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఇవన్నీ ఒకే జానర్‌లో రూపొందిన సినిమాలు కాబట్టి, ఇలాంటి పోలికలు రావడం సహజమే అని అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఏ సినిమా అయినా రాజు గెటప్ అలానే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. రాజా సాబ్‌ లో ప్రభాస్ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకూ తన మాస్ యాక్షన్ తో అదరగొట్టిన ప్రభాస్.. ఈసారి యాక్షన్ తో పాటుగా భయపెడుతూ నవ్విస్తారని భావిస్తున్నారు. ఈ కొత్త ప్రయత్నం కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నారు.

హారర్ కామెడీ అనేది ఇండియన్ సినిమాలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జోనర్. కాకపోతే వీటిల్లో నటించడానికి స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి కనబరచరు. మన సౌత్ లో అయితే అసలు ఆ జోనర్ వైపు చూడరు. అయితే మాస్ హీరో అయినప్పటికీ, రజనీకాంత్ 'చంద్రముఖి'లో హారర్ కామెడీ పాత్రను పోషించారు. వెంకటేష్ కూడా ట్రై చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కింగ్ అక్కినేని నాగార్జున 'రాజు గారి గది 2' వంటి హారర్ కామెడీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కూడా రాజాసాబ్ సినిమాతో హారర్ కామెడీ బాట పట్టారు. మాస్ ఇమేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ ఈ జోనర్ సినిమా చేయడం గొప్ప విషయమే అనుకోవాలి. మరి రజనీ మాదిరిగానే ప్రభాస్ కు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.