టాలీవుడ్ దశ దిశ మార్చిన దర్శకుడు !
తెలుగు సినిమాను ప్రాంతీయ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి.
By: Tupaki Desk | 10 Oct 2024 10:41 AM GMTఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాలో పనిచేసిన వారికి.. ఆ డైరెక్టర్ కి.. ఇంకా ఆ దర్శకుడిని ఎంకరేజ్ చేసిన ఆ నిర్మాతకి పేరు వస్తుంది. కానీ ఒక సినిమా సక్సెస్ మొత్తం ఇండస్ట్రీ గెలుపు అనుకుంటే.. ఒక దర్శకుడి విజయం అది టోటల్ పరిశ్రమ విజయం గా భావిస్తే. అతను తీసే సినిమాలు ఇచ్చే కాన్ఫిడెన్స్ చూసి వారెవా అనుకోక తప్పదు. తెలుగు సినిమాను ప్రాంతీయ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి.
అతను చేసే సినిమాలు కాస్త లేట్ అవుతాయేమో కానీ అభిమానులు ఎన్నేళ్లు వెయిట్ చేస్తారో అంతకు రెట్టింపు రేంజ్ లో సినిమా తీసి ఇస్తాడు. బాహుబలి సినిమాతో రాజమౌళి చేసిన ప్రయోగం అంతా ఇంతా కాదు. ఒక కథను రెండు ముక్కలుగా అదే రెండు భాగాలుగా చెప్పాలని అనుకోవడం పెద్ద సాహసమే. కానీ అలాంటి సాహసాన్ని అలవోకగా చేసి చూపిస్తాడు రాజమౌళి.
తెలుగు సినిమా రేంజ్ ఏంటన్నది బాహుబలితో ప్రూవ్ చేశాడు. బాహుబలి తర్వాత ఇప్పుడు దర్శకులంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు అంటే అది రాజమౌళి ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనే చెప్పొచ్చు. రాజమౌళి సినిమా చేస్తున్నాడు అంటే అందులో ప్రతి యాస్పెక్ట్ సూపర్ అనిపించాల్సిందే. 24 క్రాఫ్ట్స్ లో కూడా రాజమౌళి చెప్పబోయే కథ తాలూకా ఇన్ పుట్స్ ని ఎక్స్ ప్లోర్ చేస్తుంటాడు. అందుకే ఆయన సినిమా అంటూ రాజమౌళి రాజ ముద్ర వేస్తే అది పక్కా బ్లాక్ బస్టర్ అన్నట్టే లెక్క.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దగ్గర శిష్యరికం చేసిన రాజమౌళి శాంతినివాసం అనే సీరియల్ తెరకెక్కించారు. అది సక్సెస్ కాగా స్టూడెంట్ నెంబర్ 1 తో దర్శకుడిగా మారారు. ఆ సినిమా నుంచి తీసిన ప్రతి సినిమా హిట్ సూపర్ హిట్ కొడుతూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్ లో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు రాజమౌళి.
సినిమాపై తనకున్న ప్యాషన్ ను చూపిస్తూ తను తీసే సినిమాలు ఎంతోమంది దర్శకులకు మార్గదర్శకంగా నిలిచేలా చేస్తున్నాడు రాజమౌళి. రెండున్నర గంటల సినిమా కోసం రెండు మూడేళ్లు కష్టపడి ఆ రెండున్నర గంటల సినిమా ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూపించే సత్తా ఉన్న దర్శకుడు.
తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే దాకా నిద్రపోని పని రాక్షసుడు ఆయన. అందుకే ఆయనతో పనిచేసిన చాలామంది రాజమౌళి పని రాక్షసుడని చెబుతుంటారు. ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ ని సైతం తెలుగు పాటకు వచ్చేలా చేసిన రాజమౌళి ప్రస్తుతం నెక్స్ట్ చేయబోతున్న మహేష్ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఈసారి అకడమీ లెవెల్ లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీ కేటగిరిల మీద కూడా టార్గెట్ పెట్టాడని చెప్పొచ్చు.
తెలుగు సినిమా దశ దిశ మార్చేసిన దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు ఈరోజు. ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ.. తెలుగు సినిమాకు ఎన్నో ఆస్కార్లు సొంతమయ్యేలా చేయాలని ఆకాంక్షిస్తూ.. రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది తుపాకి.కామ్ టీమ్.