Begin typing your search above and press return to search.

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇదే అసలు పెట్టుబడి

అయితే SSMB 29 సినిమాతో పాటు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు చేయబోయే ప్రయత్నం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 4:30 AM GMT
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇదే అసలు పెట్టుబడి
X

దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్‌ రాజమౌళి తన అద్భుతమైన ప్రతిభను మరోసారి పెద్ద తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ SSMB 29 ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీప్రియులు నమ్ముతున్నారు. బాహుబలి సినిమాతో మొదటిసారి 2 వేల కోట్లను టచ్ చేసిన జక్కన్న ఈసారి మహేష్ సినిమా కోసమే వెయ్యి కోట్లు ఖర్చు చేయబోతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద లెక్క ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు.

అయితే SSMB 29 సినిమాతో పాటు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు చేయబోయే ప్రయత్నం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. బాలీవుడ్ సర్కిల్ లో కూడా ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికర అంశాలు వైరల్ అవుతున్నాయి. అసలైతే రాజమౌళి బాహుబలి తర్వాతే మహాభారతం చేయాలనుకున్నారట. కానీ అప్పట్లో ఈ ప్రయత్నం కొంత ప్రమాదకరమని పలువురు సూచించడంతో RRR సినిమాను ముందుగానే చేశారు.

ఇప్పుడేమో, మహాభారతం చేయడం తప్పనిసరి అనే భావనతో రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు చేయకపోతే మళ్లీ జీవితంలో అవకాశం రాదని రాజమౌళి భావిస్తున్నారు అని ఒక బలమైన వర్గం పేర్కొంది. ఈ మాటలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. మహాభారతం చేయగలిగే ధైర్యం, టాలెంట్ ఉన్న ఏకైక దర్శకుడు రాజమౌళేనని చాలామంది విశ్వసిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన SSMB 29 ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ సినిమా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం వచ్చే మూడు సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఒక విధంగా మహాభారతం లాంటి భారీ కాన్వాస్ సినిమాను చేయాలంటే రాజమౌళి SSMB29 ని పెట్టుబడిగా పెట్టబోతున్నాడని టాక్. హాలీవుడ్ రేంజ్ లో ప్రజెంట్ చేసి విదేశాల్లో కూడా ఈ సినిమాకు ఒక ట్రాక్ సెట్ చేయాలని చూస్తున్నట్లు టాక్.

ఇప్పటికే RRR సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లిన జక్కన్న చాలా దేశాల్లో తన ముద్ర వేశాడు. ఇక ఇప్పుడు మహేష్ సినిమాతో మరో లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసి మహాభారతం కోసం బాటలు వేయాలని చూస్తున్నాడు. మహేష్ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్కయితే మహాభారత ప్రాజెక్ట్ కోసం 2 వేల కోట్ల పెట్టుబడులు ఈజీగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. మహాభారతం ప్రాజెక్టు గురించి కూడా తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో చాలా రోజులుగా చర్చలు కొనసాగిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది దాదాపు నాలుగు లేదా ఐదు సంవత్సరాల తరువాత మాత్రమే కార్యరూపం దాల్చవచ్చని తెలుస్తోంది.

ఇక రాజమౌళి పేరు అనగానే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. గతంలో మహాభారతం చేసి విమర్శలు ఎదుర్కొన్న ఇతర దర్శకుల్లా కాకుండా, రాజమౌళి తన ఆహార్యం, సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టుకు న్యాయం చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తుది రూపం తీసుకుంటే అది భారతీయ చలనచిత్ర చరిత్రలో మరో మహాకావ్యం అవుతుందని భావిస్తున్నారు. ఇక రాజమౌళి రంగంలోకి దిగితే మన స్టార్ హీరోలు మాత్రమే కాకుండా పక్క ఇండస్ట్రీలో నుంచి కూడా చాలామంది హీరోలు ఐకానిక్ క్యారెక్టర్స్ చేసేందుకు ముందుకు వస్తారని చెప్పవచ్చు. మరి ఆ మహా మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో కాలమే సమాధానం ఇవ్వాలి.