Begin typing your search above and press return to search.

అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి.. న్యూ టెక్నాలజీ లాంచ్

అన్నపూర్ణ స్టూడియోస్‌ చలన చిత్ర నిర్మాణంలో మరో ముందడుగుగా డాల్బీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 9:21 AM GMT
అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి.. న్యూ టెక్నాలజీ లాంచ్
X

అన్నపూర్ణ స్టూడియోస్‌ చలన చిత్ర నిర్మాణంలో మరో ముందడుగుగా డాల్బీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతదేశంలోనే తొలిసారి డాల్బీ సర్టిఫికేషన్‌ కలిగిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ సౌకర్యం హైదరాబాద్‌లోని ఈ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై టెక్నాలజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 'ఆర్ఆర్ఆర్‌' రోజులను గుర్తుచేసుకున్నారు.


రాజమౌళి మాట్లాడుతూ, ‘‘ఆర్ఆర్ఆర్‌' చిత్రాన్ని డాల్బీ విజన్‌లో ప్రేక్షకులకు అందించాలని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ, ఆ సమయంలో మన దేశంలో ఆ సదుపాయం లేకపోవడంతో మా టీమ్‌ జర్మనీ వెళ్లి ఆ పని పూర్తి చేయాల్సి వచ్చింది. స్వదేశంలోనే ఇలాంటి అనుభూతిని పొందలేకపోవడం కొంత నిరాశకు గురిచేసింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ టెక్నాలజీ ఏర్పాటు చేయడం గర్వంగా ఉంది.

అలాగే నా నెక్స్ట్ సినిమా రిలీజ్‌ సమయానికి దేశంలో చాలాచోట్ల డాల్బీ విజన్‌ అందుబాటులోకి రాబోతోంది. డాల్బీ విజన్‌లో సినిమా చూడటం సరికొత్తగా గ్రాండియర్ ఫీల్ ను అందిస్తుంది. విజువల్స్‌ పరంగా వచ్చే క్లారిటీ కథను మరో లెవెల్

కు తీసుకువెళ్తుంది. రానున్న రోజుల్లో ప్రేక్షకులందరూ కూడా దీనిని

అనుభూతి చెందాలని కోరుకుంటున్నా’’ అని రాజమౌళి వివరణ ఇచ్చారు. ఇక డాల్బీ విజన్‌ ద్వారా విజువల్స్‌లో మెరుగైన క్లారిటీ అందించడంతో పాటు కథ చెప్పే విధానాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే, నటుడు నాగార్జున ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణలోని మా స్టూడియోస్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా డాల్బీ విజన్‌ లాంటి గేమ్‌ ఛేంజింగ్‌ టెక్నాలజీని ప్రారంభించడం గొప్ప విషయమని భావిస్తున్నా. భారతీయ సినిమా స్థాయిని పెంచడంలో మా ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతాయి’’ అని ఆయన తెలిపారు.

ఇవే కాకుండా, సుప్రియా యార్లగడ్డ ఈ టెక్నాలజీ వల్ల సినిమా మేకింగ్‌ పూర్తిగా మారిపోతుందని, ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతి కలిగిస్తుందని పేర్కొన్నారు. ‘‘ఇప్పటివరకు మనకు అందుబాటులో లేని విధంగా విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ టెక్నాలజీ అందిస్తుంది. సినిమా ప్రమాణాలను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది’’ అని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్‌'కు సంబంధించిన ప్రత్యేక ఫుటేజ్‌ను డాల్బీ విజన్‌ ద్వారా ప్రదర్శించారు. ఇందులో వచ్చిన విజువల్స్‌ హాల్‌లోని ప్రేక్షకులందరినీ మెస్మరైజ్‌ చేశాయి. డాల్బీ లేబొరేటరీస్ రూపొందించిన ఈ టెక్నాలజీ, మరెన్నో భారతీయ సినిమాలకు కొత్త దిశను అందించబోతుందని ప్రముఖులు చెబుతున్నారు.