RRRకి ఆస్కార్.. బ్రెజిలియన్ డైరెక్టర్ కనెక్షన్!
ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ రేసులో ఉన్న సినిమాలకు పురస్కారాలు అందజేసే ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
By: Tupaki Desk | 6 March 2025 9:51 AM ISTఇటీవలే ప్రతిష్ఠాత్మక అకాడెమీ అవార్డులను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ రేసులో ఉన్న సినిమాలకు పురస్కారాలు అందజేసే ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో బ్రెజిల్ దేశం నుంచి `ఐండా ఎస్టౌ అక్వి` (ఐయామ్ స్టిల్ హియర్) చారిత్రాత్మక తొలి ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అయితే తమ దేశానికి ఇలాంటి గొప్ప పురస్కారాన్ని అందించిన దర్శకుడిపై దర్శకదిగ్గజం రాజమౌళి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.
బ్రెజిలియన్ దర్శకుడితో రాజమౌళి కనెక్షన్ ఎక్కడ? అంటూ ఆరాలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. `ఐయామ్ స్టిల్ హియర్` దర్శకుడు వాల్టర్ సల్లెస్‌ను రాజమౌళి అభినందించడం వెనక ప్రత్యేక కారణం ఉంది. 2004లో చే గువేరాపై తీసిన `ది మోటార్‌సైకిల్ డైరీస్` జక్కన్న తీసిన బ్లాక్‌బస్టర్ RRR కి ప్రేరణ. ఈ సినిమాని బ్రెజిలియన్ దర్శకుడు వాల్టర్ సల్లెస్ తెరకెక్కించారు.
`ఐండా ఎస్టౌ అక్వి`తో బ్రెజిల్‌కు మొట్టమొదటి అకాడమీ అవార్డును తెచ్చిపెట్టినందుకు నాకు ఇష్టమైన వాల్టర్ సల్లెస్‌కు హృదయపూర్వక వందనం అని రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఐయామ్ స్టిల్ హియర్‌లో ప్రధాన పాత్రధారి ఫెర్నాండా టోర్రెస్ కు, ఓవర్ నైట్ లో నాలుగు ఆస్కార్‌లను గెలుచుకున్న మొదటి చిత్రనిర్మాతగా చరిత్రను సృష్టించినందుకు సీన్ బేకర్‌లకు రాజమౌళి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఎస్.ఎస్.రాజమౌళి ఒడిశాలోని కోరాపుట్‌లో SSMB29 కోసం కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మహేష్, ప్రియాంక చోప్రా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అడవి నేపథ్యంలో సాహసాలతో రక్తి కట్టించే విజువల్స్ ని అందించాలని రాజమౌళి తపిస్తున్నారు.