త్వరలోనే రాజమౌళి ప్రెస్‌మీట్?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 22 Feb 2025 6:08 AM GMTదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఇది ఒకటి. భారీ అంచనాలతో చాలా గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో జరుగుతుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లాక ఇదే మొదటి షెడ్యూల్. అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక రాజమౌళి ప్రెస్ మీట్ ను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.
మామూలుగా తాను చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు సినిమాలోని నటీనటులు, తన టీమ్ తో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించేబోయే క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తో పాటూ సినిమా ఏ జానర్ లో, ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందనే విషయాల్ని రివీల్ చేసేవాడు. తన గత సినిమా ఆర్ఆర్ఆర్ కు కూడా రాజమౌళి దీన్నే ఫాలో అయ్యాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి సైలైంట్ గానే ఉంటూ వస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ షూటింగ్ పూర్తైన తర్వాత రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించి ఎస్ఎస్ఎంబీ29 గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను జక్కన్న ఈ ప్రెస్ మీట్ లో రివీల్ చేసే ఛాన్సుంది. అంతేకాదు, ఈ ప్రెస్ మీట్ తోనే రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు.
త్వరలోనే ఈ ప్రెస్ మీట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. దీంతో ఆ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఎలాంటి విషయాలను మాట్లాడనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా రాజమౌళి ప్రెస్ మీట్ తర్వాత ఎస్ఎస్ఎంబీ29 సినిమా విషయంలో ఉన్న పలు సందేహాలకు క్లారిటీ వచ్చే అవకాశముంది.