Begin typing your search above and press return to search.

పిక్ టాక్: సింహంలో మహేష్ ని చూస్తున్నావా జక్కన్నా?

తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   30 Oct 2024 10:23 AM GMT
పిక్ టాక్: సింహంలో మహేష్ ని చూస్తున్నావా జక్కన్నా?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 'SSMB 29' అని పిలుచుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దర్శకుడు లొకేషన్ల వేట ప్రారంభించారు. దీని కోసం ఇటీవలే కెన్యా వెళ్లిన జక్కన్న.. ఎప్పటికప్పుడు అక్కడి అప్డేట్లు పంచుకుంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో తీసుకున్న ఓ ఫొటోని రాజమౌళి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. దీంట్లో అడవికి రారాజుగా పిలిచే సింహం ఫొటోకి ఎదురుగా జక్కన్న నిలబడి ఉన్నారు. ''క్రిస్ ఫాలోస్ తీసిన సెరెంగేటి రాజు ఫొటో ఇది. దీని పేరు BOB జూనియర్.. ఇది బెల్ ను మోగిస్తుందా?'' అని పేర్కొన్నారు. సెరెంగేటి అనేది ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలోని ఒక ప్రాంతం. అక్కడ రాజుగా పిలుచుకునే సింహం ఫొటోనే దర్శకుడు షేర్ చేసారు.

రాజమౌళి ఈ పోస్ట్ లో లయన్ ఫోటోకి మహేష్ బాబుని ట్యాగ్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. 'సింహంలో మహేష్ ని చూస్తున్నాను' అని ఓ అభిమాని కామెంట్ చెప్పాడు. 'BOB అంటే బాక్స్ ఆఫీస్ బాద్షా' అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. జక్కన్న ఇన్‌స్టా పోస్టుకి మహేశ్ కూడా స్పందించారు. సానుకూల భావాలను, విపరీతమైన ప్రేమను వ్యక్తపరిచే ఎమోజీలను కామెంట్స్ గా పెట్టారు.

'SSMB 29' లొకేషన్స్‌ సెర్చ్‌లో భాగంగా ఇటీవల ఎడారి ప్రాంతంలో జీబ్రాలతో తిరుగుతున్న ఓ ఫొటోని షేర్‌ చేసారు రాజమౌళి. ‘కనిపెట్టడానికి తిరుగుతున్నా’ అని దానికి క్యాప్షన్‌ కూడా పెట్టారు. ఈ క్రమంలో ఇప్పుడు సింహం పిక్ ని పంచుకుంటూ, దానికి మహేశ్ బాబుని ట్యాగ్ చేసారు. చూస్తుంటే దర్శకుడు ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి తగ్గట్టుగానే భారీ ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

తనకు జంతువులు అంటే ఇష్టమని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ కంటే మహేష్ మూవీలో ఎక్కువ జంతువులు కనిపిస్తాయని చెప్పారు. చెప్పినట్లుగానే ఎక్కువ యానిమల్స్ ఉండే షూటింగ్ లొకేషన్స్ కు వెతికే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మరికొన్ని జంతువులను సృష్టిస్తారని టాక్ నడుస్తోంది. ఏదేమైనా అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ కావడంతో.. సినిమాలో చాలా భాగం షూటింగ్ విదేశాల్లో జరిగే అవకాశం ఉందని భావించవచ్చు.

మహేశ్‌ బాబు - రాజమౌళి చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటు, పలు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీని కోసం 1000 కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేష్ మునుపెన్నడూ చూడని కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ పాన్ ఇంటెర్నేషనల్ మూవీని, దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని ఈ మధ్యనే విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు.