SSMB29: ఏఐ టెక్నాలజీతో రాజమౌళి అడ్వెంచర్!
టెక్నాలజీ సాయంతో తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు కృషి చేస్తుంటారు.
By: Tupaki Desk | 18 Oct 2024 9:30 PM GMTఆధునిక సాంకేతికను ఉపయోగించుకోవడంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దిట్ట అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెక్నాలజీ సాయంతో తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు కృషి చేస్తుంటారు. ఈ విధంగానే వెండితెర మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న జక్కన్న.. ఇప్పుడు SSMB29 కోసం న్యూ టెక్నాలజీని వాడబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచీ అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీని తన సినిమాల్లో ఉపయోగించుకుంటూ వస్తున్నారు. మగధీర, ఈగ, యమదొంగ వంటి చిత్రాల్లో వీఎఫ్ఎక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. బాహుబలి 1&2, RRR చిత్రాల్లో విజువల్స్ ఎఫెక్ట్స్ సైతం గొప్పగా ఉంటాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న భారీ చిత్రంలో VFX కు అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అందుకే వరల్డ్ క్లాస్ విజువల్స్ అందించడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట.
ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) డిజిటల్ వరల్డ్ లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ టెక్నాలజీ సినీ రంగంలోనూ నూతన ఒరవడిని సృష్టిస్తోంది. ఏఐ ద్వారా చనిపోయిన నటీనటులను తిరిగి తెర మీదకు తీసుకొస్తున్నారు. దీన్ని ఉపయోగించి డబ్బింగ్ చెప్పించడమే కాదు, పాటలు కూడా పాడించేస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి సైతం ఈ కృత్రిమ మేథస్సుతో ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.
మహేశ్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు రాజమౌళి. హలీవుడ్ రేంజ్ లో తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను గట్టిగా వాడుకోవాలని దర్శకుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏఐతో తక్కువ వ్యవధిలో మంచి అవుట్ పుట్ వచ్చే అవకాశాలు ఉండటంతో, వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయడానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుందని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఏఐలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలతో టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాక్ నడుస్తోంది.
SSMB29 సినిమాని ఇండియానా జోన్స్ తరహాలో ఫ్రాంచైజీగా మార్చే ఆలోచన చేస్తున్నారని గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇటీవలే రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మహేశ్ కోసం రెండేళ్లు కష్టపడి కథ రెడీ చేసినట్లుగా తెలిపారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా నిర్మాణం కోసం ప్రముఖ హలీవుడ్ కంపెనీలతో చేతులు కలుపుతున్నారని టాక్. ఇందులో టాప్ నాచ్ టెక్నీషియన్స్, పాపులర్ స్టార్ కాస్టింగ్ భాగం అవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.