Begin typing your search above and press return to search.

పుష్పరాజ్ అడ్డాలో జక్కన్నకి ఏం పని...?

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 4:50 AM GMT
పుష్పరాజ్ అడ్డాలో జక్కన్నకి ఏం పని...?
X

అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పుష్ప 2' సినిమా ఈ డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ సీక్వెల్‌ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌ లో సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే అనుకోని అతిథి అన్నట్లుగా రాజమౌళి పుష్ప2 సెట్‌ లో ఎంట్రీ ఇచ్చారట. రాజమౌళి రాకతో పుష్ప 2 యూనిట్‌ సభ్యులు అంతా సర్‌ప్రైజ్ అయ్యారని తెలుస్తోంది. సుకుమార్ తో ఉన్న అనుబంధం తో జక్కన్న పుష్ప రాజ్ సెట్‌ కి వెళ్లారు.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని పట్టాలెక్కించేందుకు గాను సెట్‌ వర్క్ తో పాటు పలు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే పక్కన పుష్ప 2 సినిమా షూటింగ్‌ జరుగుతుందని తెలిసిన రాజమౌళి అక్కడకు వెళ్లారట. రాజమౌళి రాక తో సుకుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్‌ సభ్యులను పరిచయం చేయడంతో పాటు, సినిమా గురించిన పలు విషయాలను రాజమౌళి తో సుకుమార్‌ చర్చించారు. దాదాపు 30 నిమిషాల పాటు జక్కన్న పుష్పరాజ్ అడ్డాలో ఉన్నారు.

పుష్ప 2 సినిమా కు సంబంధించిన ఒక సన్నివేశం చిత్రీకరణ ను రాజమౌళి అక్కడే ఉండి శ్రద్దగా గమనించినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సుకుమార్‌ సీన్‌ క్రియేషన్‌ ను రాజమౌళి చూసి చాలా బాగా తీశారంటూ అక్కడికి అక్కడే అభినందించారట. పుష్ప 2 సినిమా సెట్‌ లో రాజమౌళి చేసిన సందడి తాలూకు వీడియో ను సినిమా విడుదల సమయంలో లేదా ముందే యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టాలీవుడ్‌ లో ఇలాంటి కలయికలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందుకే పుష్ప 2 సెట్‌ లో రాజమౌళి అనే వార్తలు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి.

టాలీవుడ్‌ స్టార్‌ దర్శకులు అయిన రాజమౌళి, సుకుమార్‌ లు మంచి స్నేహితులు. ఇద్దరి కాంబోలో గతంలో పలు ఇంటర్వ్యూలు వచ్చాయి. ఒకరి సినిమాలను మరొకరు అభినందించుకోవడం మనం చూస్తూ ఉంటాం. పాన్ ఇండియా స్టార్‌ దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాజమౌళి కి సుకుమార్‌ ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని రాజమౌళి పలు వేదిక ల మీద చెప్పుకొచ్చారు. సుకుమార్‌ సైతం రాజమౌళి సినిమాలను, ఆయన మేకింగ్‌ ను ప్రశంసించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ అనుబంధంతోనే సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా సెట్స్ లో రాజమౌళి సందడి చేశారనే టాక్‌ వినిపిస్తోంది.