రాజమౌళి నికర ఆస్తుల విలువ?
దర్శకధీరుడు SS రాజమౌళి ఈరోజు (అక్టోబర్ 10న) తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో రాజమౌళి 12 సినిమాలకు దర్శకత్వం వహించారు
By: Tupaki Desk | 10 Oct 2023 10:30 AM GMTదర్శకధీరుడు SS రాజమౌళి ఈరోజు (అక్టోబర్ 10న) తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో రాజమౌళి 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించనున్నారు. ఇతరులతో పోలిస్తే 20 ఏళ్లలో ఆయన తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ. నంబర్ కంటే నాణ్యతకే ఆయన ప్రాముఖ్యతనిచ్చారు.
RRR చిత్రంతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ సాధించడమే గాక.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ ని దేశానికి అందించిన తొలి దర్శకుడిగా రాజమౌళి రికార్డులకెక్కారు. బాహుబలి- RRR వంటి పాన్-ఇండియా చిత్రాల భారీ విజయంతో రాజమౌళి భారతదేశానికి ఇంటి పేరుగా మారారు. డీసీ- ఎంసీయు తరహాలో లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో మ్యాజిక్ చేయగల అసాధారణ దర్శకుడు రాజమౌళి అని ప్రశంసలు అందుకుంటున్నారు.
దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ గా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. అడ్వెంచర్ అండ్ ఫాంటసీ జానర్ సినిమాలతో అద్భుతాలు చేసిన దర్శకుడిగాను రాజమౌళి పాపులరయ్యారు. వినోద పరిశ్రమలో ఆయన చేసిన విశేష కృషిని దృష్టిలో ఉంచుకుని జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు దక్కాయి. అయితే రెండు దశాబ్ధాల కెరీర్ లో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఎంత? అంటే.. దానికి ఛూఛాయగా కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మొత్తం నికర ఆస్తుల విలువ 158కోట్లు ఉంటుందని అంచనా. అంటే 20 మిలియన్ డాలర్లు అని ఒక లెక్కను అంచనా వేస్తున్నారు. రాజమౌళికి రకరకాల ఆదాయ వనరులున్నాయి. ప్రధాన ఆదాయం సినిమాల నుంచే వస్తుంది. వ్యక్తిగత వ్యాపారాల్లో పెట్టుబడులు సహా ప్రొడక్షన్ హౌస్ పెట్టుబడుల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నారు. హైదరాబాద్ మణికొండ సమీపంలో రాజమౌళికి విలాసవంతమైన బంగ్లా ఉంది. 2008లో ఇంటిని కొనుగోలు చేశారని సమాచారం ఉంది. హైదరాబాద్‌లోని ఇంటితో పాటు ఔటర్ లో ఫామ్ హౌస్ లు, కొన్ని స్థలాలు ఉన్నాయని కథనాలొచ్చాయి. ఇతర నగరాల్లో కూడా అతడికి పలు అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఖరీదైన కార్లు రాజమౌళి గ్యారేజీలో ఉన్నాయి. రేంజ్ రోవర్ - BMW సహా కొన్ని విలాసవంతమైన కార్లు ఆయన సొంతం. వీటి ధర కోట్లలో ఉంది.
ప్రస్తుతం రాజమౌళి RRR విజయం తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో భారీ యాక్షన్ అడ్వెంచర్ ని తెరకెక్కించనున్నారు. అలాగే నిర్మాతగా పలు ప్రాజెక్టులకు సపోర్ట్ ని అందిస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా అనే కొత్త ప్రాజెక్ట్ కోసం రాజమౌళి పని చేస్తున్నారు. భారతీయ సినిమా పితామహుడిగా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం.