ఆర్‌ఆర్ఆర్ : 45 సెకన్ల స్పీచ్ కి 3 వారాల ప్రాక్టీస్
తాజాగా రాజమౌళి అప్పటి అవార్డు వేడుక అనుభవాలను జపాన్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 20 March 2024 9:12 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొంది 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కిన విషయం తెల్సిందే. ఒక ఇండియన్ మూవీకి, ఒక ఇండియన్ పాటకు మొదటి సారి ఆస్కార్ రావడంతో ప్రపంచం మొత్తం తిరిగి చూసింది.
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును అందుకునేందుకు సంగీత దర్శకుడు కీరవాణి అకాడమీ అవార్డు వేడుకల కార్యక్రమానికి హాజరు అయిన విషయం తెల్సిందే. స్టేజ్ ఎక్కి 45 సెకన్లు మాట్లాడిన కీరవాణి మొత్తం దేశం తన వైపు తిరిగి చూసుకునేలా చేశాడు. మాట్లాడింది కొంతే అయినా కూడా అందులో చాలా విషయాలను కీరవాణి పేర్కొన్నాడు.
తాజాగా రాజమౌళి అప్పటి అవార్డు వేడుక అనుభవాలను జపాన్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. జపాన్ లోని ఒక థియేటర్ లో ఆర్ఆర్‌ఆర్ సినిమా 500 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజమౌళి అండ్ టీం అక్కడకు వెళ్లారు. ఆసమయంలో ఆస్కార్ అవార్డు వేడుక అనుభవాలను షేర్ చేసుకున్నాడు.
నాటు నాటు నామినేట్ అయిన సమయంలో కచ్చితంగా అవార్డు వస్తుందని భావించాం. అందుకే అన్న కీరవాణి తో స్టేజ్ పై స్పీచ్ ను ప్రాక్టీస్ చేయించాం. 45 సెకన్ల సమయం మాత్రమే ఇస్తారు కనుక అందుకు తగ్గట్లుగా ఆయన్ను ప్రిపేర్ చేశాం. దాదాపు మూడు వారాల పాటు అన్నయ్య తో ప్రిపరేషన్ చేయించాం.
అన్నయ్య కాస్త లావుగా ఉంటారు. కనుక సీటు నుంచి లేచి స్పీడ్ గా వెళ్లి మెట్టు ఎక్కిన తర్వాత మాట్లాడటం కాస్త ఇబ్బంది. అందుకే ఆయన్ను కాస్త మెల్లగానే స్టేజ్ పైకి వెళ్లమని చెప్పాము. చాలా విషయాలు చెప్పి అకాడమీ అవార్డుల వేడుకకు తీసుకు వెళ్లాము.
అవార్డు ప్రకటించిన వెంటనే మెల్లగా కాకుండా చాలా స్పీడ్ గానే అన్నయ్య నడుచుకుంటూ వెళ్లి అవార్డును అందుకున్నాడు. అయితే ఏదోలా ఇబ్బంది లేకుండా ఆయన అనుకున్నది మాట్లాడేసి వచ్చారు అంటూ రాజమౌళి అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.