Begin typing your search above and press return to search.

‘మోడ్రన్ మాస్టర్స్’.. ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి డాక్యుమెంటరీ!

‘మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్.ఎస్.రాజమౌళి’ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ డాక్యుమెంటరీ ఈరోజు(ఆగస్టు 2) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   2 Aug 2024 9:57 AM GMT
‘మోడ్రన్ మాస్టర్స్’.. ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి డాక్యుమెంటరీ!
X

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ‘బాహుబలి’ చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన జక్కన్న.. RRR సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. 'నాటు నాటు' పాటతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఆస్కార్ కలను సాకారం చేసిపెట్టారు. అలాంటి దర్శకధీరుడిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీ తాజాగా ఓటీటీలో విడుదలైంది.

‘మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్.ఎస్.రాజమౌళి’ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ డాక్యుమెంటరీ ఈరోజు(ఆగస్టు 2) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా.. 'పర్ఫెక్షనిస్ట్, విజనరీ, స్టోరీ టెల్లర్' అంటూ లేటెస్టుగా మరో కొత్త ప్రోమోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇందులో టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ కు చెందిన సినీ ప్రముఖులు రాజమౌళిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇందులో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రానా దగ్గుబాటి, ఎంఎం కీరవాణి, కరణ్‌ జోహర్‌ తో పాటుగా హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ లు రాజమౌళి గురించి మాట్లాడారు. ఇండియన్ సినిమాలో ఎస్.ఎస్.రాజమౌళి కంటే గొప్ప ఫిలిం మేకర్స్ లేడని బాలీవుడ్‌ ఫిలిం మేకర్ కరణ్‌ జోహర్‌ అభిప్రాయపడ్డారు. ఆయన ఒక సినిమా స్టార్ట్ చేస్తే పూర్తిగా దాని కోసమనే తన మనసుని నిమగ్నం చేస్తాడని ఎమ్.ఎమ్ కీరవాణి తెలిపారు. తన సినిమాల ద్వారా మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను సజీవంగా ఉంచుతారని, రాబోయే తరాల వారికి ఆ కథలను తెలియజెప్తారని ఎన్టీఆర్ అన్నారు.

రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ అని, గ్లోబల్ సినిమా ఐకాన్ అని జేమ్స్‌ కామెరూన్‌ కొనియాడారు. ఇలాంటి దర్శకుడిని ఇప్పటి వరకు చూడలేదని,అతనొక మ్యాడ్ పర్సన్ అని ప్రభాస్‌ అన్నారు. ''నిజం చెప్పాలంటే నేను కేవలం నా కథకు మాత్రమే బానిసను'' అంటూ చివర్లో రాజమౌళి చెప్పడంతో ఈ ప్రోమో ముగిసింది. తెర వెనుక జక్కన్నని పరిచయం చేస్తున్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్.ఎస్.రాజమౌళి’ డాక్యుమెంటరీకి రాఘవ్‌ కన్నా దర్శకత్వం వహించారు. సమీర్‌ నాయర్, దీపక్‌ సెగల్‌ నిర్మించారు. నాలుగు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది సినిమాల పట్ల ఆయనకున్న ప్రేమకు తెలియజేస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే డబ్బింగ్ విషయానికొచ్చే సరికి విమర్శలు వస్తున్నాయి. తెలుగు వారైన రాజమౌళి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రానా దగ్గుబాటి, ఎంఎం కీరవాణిలకు వేరే వాళ్ళతో తెలుగు డబ్బింగ్ చెప్పించడంపై ట్రోల్ చేస్తున్నారు.