#అవంతిక రేప్ నా ఉద్ధేశాన్ని అర్థం చేసుకోలేదన్న జక్కన్న
అయితే ఇప్పటికీ ఉత్తరాది క్రిటిక్స్ దంగల్ మాత్రమే భారతదేశంలో నంబర్ -1 సినిమా అని ప్రస్థావిస్తూ బాహుబలిని తగ్గించే ప్రయత్నం చేసారు.
By: Tupaki Desk | 4 Aug 2024 5:21 AM GMTరాజమౌళి సృష్టించిన బాహుబలి సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి ఫ్రాంఛైజీలో బాహుబలి 2 ఇప్పటికీ భారతదేశంలో అత్యధిక వసూళ్ల (1000 కోట్ల నెట్)తో నంబర్ -1 సినిమాగా రికార్డుల్లో ఉంది. విదేశీ వసూళ్లలో మాత్రమే అమీర్ ఖాన్ `దంగల్` నంబర్-1 గా ఉంది. దంగల్ భారతదేశంలో 387కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది.
అయితే ఇప్పటికీ ఉత్తరాది క్రిటిక్స్ దంగల్ మాత్రమే భారతదేశంలో నంబర్ -1 సినిమా అని ప్రస్థావిస్తూ బాహుబలిని తగ్గించే ప్రయత్నం చేసారు. అంతేకాదు బాహుబలి సినిమాలో అవంతిక తో ప్రభాస్ రొమాన్స్ ని కూడా తప్పు దారి పట్టించింది బాలీవుడ్ క్రిటిక్స్. అవంతిక రేప్! అంటూ ప్రచారం చేయడంలో ఒక సెక్షన్ మీడియా సఫలమైంది. అంతేకాదు జాతీయ మీడియాలో ఇది విస్త్రతంగా ప్రచారం చేసారు. రేప్ ఆఫ్ అవంతిక అంటూ ఒక మహిళా జర్నలిస్ట్ దానిని పెద్ద సీన్ చేసారు. దర్శకుడైన రాజమౌళిపై తీవ్రమైన దాడికి దిగారు. దర్శకుడు రాజమౌళి దీనిపై అప్పట్లో పెద్దగా స్పందించలేదు.
ఇప్పుడు టైమ్ వచ్చింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న `బాహుబలి`లోని వివాదాస్పద సన్నివేశం గురించి ప్రస్థావించారు. శివుడు (ప్రభాస్) పాత్ర అవంతిక (తమన్నా) వెంటపడే సీన్ లో తన మురికి బట్టల్ని తొలగించే సన్నివేశాన్ని జోడించడంతో దానిని హిందీ మీడియా తప్పు పట్టింది. అవంతిక రేప్ కి గురైందంటూ విమర్శించారు. అయితే తన ఉద్ధేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రాజమౌళి నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో తెలిపారు.
``అవంతిక ఒక యోధురాలు.. కానీ ఆమె ఒకరిగా ఉండటానికి ఇష్టపడదు. `అందమైన స్త్రీత్వం ఉన్న అమ్మాయిగా ఉండాలని కోరుకున్నాను. అలా ఆ సన్నివేశం మలిచాను`` అని రాజమౌళి అన్నారు. శివుడు బాణంతో గాయపడినప్పటికీ అతడి దృష్టిని మనసును అవంతికపైనే కేంద్రీకరించాడు. ఆమె స్త్రీత్వాన్ని స్వీకరించాలనే కోరికను బహిరంగ పరిచాడని జక్కన్న వివరణ ఇచ్చారు. ఆ సీన్ తీయడం వెనక నా ఉద్ధేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రాజమౌళి అన్నారు. శివగామి, దేవసేన వంటి పవర్ ఫుల్ పాత్రలు ఉన్నా కానీ, అవంతిక వంటి పాత్రలను తమకు అనుకూలంగా మలుచుకుని దానిని విమర్శించేందుకు ప్రయత్నించారని కూడా రాజమౌళి ప్రతివిమర్శ చేసారు. గొప్పగా మలిచిన పాత్రలను వదిలేసి ఏదో ఒక పాత్రతో లోపాన్ని అంటగట్టే ప్రయత్నం రుద్దారని జక్కన్న పరోక్షంగా విమర్శించారు. విమర్శించేప్పుడు ఆ సందర్భాన్ని కూడా తరచి చూడాలని కూడా రాజమౌళి సూచించారు.
అయితే రాజమౌళి వివరణకు కొందరు నెటిజనులు సంతృప్తి చెంది అతడి ఆలోచనను సమర్థించగా, మరికొందరు ఇప్పటికీ దానిని సమర్థించలేదు. ఆ సన్నివేశం సరికాదని అన్నారు. నిజానికి మారిన సామాజిక ధృక్పథం.. మారిన స్త్రీ ఆలోచనలను పరిగణించి ఫిలింమేకర్స్ స్త్రీల పాత్రలను మలచాల్సి ఉంటుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కళాత్మక దృష్టిని అర్థం చేసుకునే కంటే విమర్శించేవారే ఎక్కువగా ఉంటారనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి.