నెట్‌ఫ్లిక్స్ నిర్వాకంపై రాజమౌళి ఫ్యాన్స్ సీరియస్
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సంచలన విజయం సాధించింది. ఆస్కార్- గోల్డెన్ గ్లోబ్స్- హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులను కొల్లగొట్టింది
By: Tupaki Desk | 2 Aug 2024 6:43 AM GMTదర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సంచలన విజయం సాధించింది. ఆస్కార్- గోల్డెన్ గ్లోబ్స్- హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులను కొల్లగొట్టింది. అదంతా సంచలన విషయమే అయినా, ఆ తర్వాత మహేష్ తో రాజమౌళి సినిమా ప్రారంభోత్సవానికి చాలా ఎక్కువ సమయం పట్టడం అభిమానులను నిరాశపరిచింది. మహేష్ తో జక్కన్న సినిమా గురించి అనధికారిక అప్ డేట్స్ గాసిప్స్ తప్ప.. అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని టీమ్ వెల్లడించడం లేదు. దీంతో కొంతకాలంగా ఇటు మహేష్ అటు రాజమౌళి అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది.
ఇప్పుడు రాజమౌళిపై డాక్యు సినిమాని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించి చెప్పిన టైముకి ఆ పని చేయకపోవడంతో నెట్ ఫ్లిక్స్ పై అభిమానులు సీరియస్ గా ఉన్నారు. ఇటీవలే రాజమౌళిపై డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. కానీ రిలీజ్ డేట్ విషయంలో స్పష్ఠతనివ్వడంలో నెట్ ఫ్లిక్స్ మళ్లీ టాలీవుడ్ అభిమానులను నిరాశపరిచింది.
రాజమౌళి జీవితంలోని విశేషాలతో రూపొందించిన ఈ డాక్యు సిరీస్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించగా, నెట్‌ఫ్లిక్స్ నిర్మించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న `డాక్యుమెంట్-ఫిల్మ్` కి `మోడరన్ మాస్టర్స్: SS రాజమౌళి` అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. దీంతో టాలీవుడ్ ఔత్సాహికులు.. మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. 74 నిమిషాల ప్రత్యేక ఫీచర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యు చిత్రంలో జేమ్స్ కామెరూన్, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎమ్ఎమ్ కీరవాణి, రమా రాజమౌళి వంటి ప్రముఖులు రాజమౌళి గురించి మాట్లాడిన విషయాలను పొందుపరిచారు. వారంతా రాజమౌళితో తమ అనుబంధం గురించి, అతడి ప్రతిభ గురించి, ప్రభావవంతమైన పనితనం గురించి ప్రస్థావించారు.
దర్శకధీరుడిపై డాక్యు-ఫిల్మ్ గురువారం అర్ధరాత్రి నుంచి అందుబాటులో ఉంటుందని చాలా మంది ఆశించారు. కానీ దురదృష్టవశాత్తూ ఇది జరగలేదు. నెట్‌ఫ్లిక్స్ దీన్ని ఇంకా విడుదల చేయలేదు. ఈరోజు ఆలస్యంగానైనా రాజమౌళి డాక్యు సినిమా రిలీజవుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పటికే తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.