Begin typing your search above and press return to search.

'మోడ్రన్‌ మాస్టర్స్‌' రివ్యూ: జక్కన్న డాక్యుమెంటరీ ఆకట్టుకుందా?

ఎస్‌.ఎస్‌.రాజమౌళి... తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శక ధీరుడు.

By:  Tupaki Desk   |   3 Aug 2024 8:39 AM GMT
మోడ్రన్‌ మాస్టర్స్‌ రివ్యూ: జక్కన్న డాక్యుమెంటరీ ఆకట్టుకుందా?
X

ఎస్‌.ఎస్‌.రాజమౌళి... తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శక ధీరుడు. భాషా ప్రాంతీయత అడ్డంకులు చెరిపేస్తూ, పాన్ ఇండియాకి కొత్త బాటలు వేసిన గొప్ప దర్శకుడు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే వెండితెర అద్భుతాలు సృష్టిస్తూ, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. వందేళ్ల ఇండియన్ సినిమాకి ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టి, భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా నిలిచారు. అలాంటి లెజండరీ డైరెక్టర్ పై రూపొందించిన డాక్యుమెంటరీ ‘మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్.ఎస్. రాజమౌళి’. ఇది ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

'బాహుబలి', RRR చిత్రాల దర్శకుడు రాజమౌళి మీద డాక్యుమెంటరీ కావడంతో తెలుగులోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పై ఆసక్తి కనబరిచారు. దీనికి తగ్గట్టుగానే ప్రోమో వీడియోలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. రాఘవ్‌ ఖన్నా దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీని సమీర్‌ నాయర్, దీపక్‌ సెగల్‌ నిర్మించారు. 74 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో జక్కన్న వ్యక్తిగత జీవితం, ఆయన సినిమా సంగతులను, తెర వెనుక కథలను తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

రాజమౌళి కుటుంబ నేపథ్యం, సినీ ప్రయాణం ఎలా మొదలైంది? పాన్ ఇండియా ఫిలిం మేకర్ స్థాయికి చేరుకోడానికి ఎంతగా కష్టపడ్డారు? అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటి? అనే అంశాలతో ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ను రూపొందించారు. ఇందులో రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటుగా టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ కు చెందిన సినీ ప్రముఖులు అభిప్రాయాలను పొందుపరిచారు. అలానే దర్శకుడిని ప్రముఖ జర్నలిస్టు, ఫిల్మ్‌ క్రిటిక్‌ అనుపమ చోప్రా ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్స్‌ ను కూడా జత చేసారు.

ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రానా దగ్గబాటి, ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ, వి విజయేంద్ర ప్రసాద్, శోబు యార్లగడ్డ, కె రాఘవేంద్రరావు తదితరులు రాజమౌళితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. దీంట్లో హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్ కామెరూన్, బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కరణ్ జోహార్ లాంటి వారు జక్కన్నను ఆకాశానికి ఎత్తేయడం తెలుగు ఆడియన్స్ కు గర్వంగా అనిపిస్తుంది. అలానే మనకు ఆయన గురించి పెద్దగా తెలియని ఆసక్తికరమైన అంశాలు, ఇప్పటి వరకూ ఇంటర్నెట్ లో కూడా అందుబాటులో లేని రాజమౌళి పాత ఫొటోలు ఈ డాక్యుమెంటరీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

సినిమాల్లోకి రాకముందు రాజమౌళి టెలివిజన్ రంగంలో వర్క్ చేయడం, కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ‘శాంతినివాసం’ సీరియల్ కు దర్శకత్వం వహించడం వంటి అంశాలను వివరించారు. అంతేకాదు ‘పిల్లన గ్రోవి’ అనే చిత్రంలో రాజమౌళి బాల నటుడిగా నటించారని, ‘అర్థాంగి’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పని చేశారనే విషయాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా బయటపెట్టారు. ‘స్టూడెంట్‌ నెం. 1’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవ్వడంతో పాటుగా ‘మగధీర’ సినిమా సంగతులను పంచుకున్నారు. 'బాహుబలి' చిత్రానికి రిలీజ్ రోజు ఫ్లాప్‌ టాక్‌ రావడం, ‘కట్టప్ప’ క్యారెక్టర్‌ ను తక్కువగా చూపించారనే విమర్శలు రావడంపై రాజమౌళి స్పందించారు.

రాజమౌళి స్టోరీ ఐడియాలు, స్క్రీన్ మీద హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం, హీరో పాత్రకి తగ్గట్టుగా విలన్‌ క్యారక్టర్ ను సృష్టించడం, యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ వంటి అంశాల మీద జక్కన్న సామర్థ్యాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. 'ఏ ఫిల్మ్‌ బై ఎస్‌. ఎస్‌. రాజమౌళి' అనే ట్యాగ్‌లైన్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది రాజమౌళి మాటల్లో వినొచ్చు. రాజమౌళి మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు, మార్కెటింగ్ జీనియస్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ మేకర్స్ ఈ అంశాలను డాక్యుమెంటరీలో ప్రస్తావించలేదు. అలానే ఇప్పటికే అందరికీ తెలిసిన విషయాలు ఎక్కువ ఉండటం, సినీ ప్రియులకు తెలియని విశేషాలు తక్కువ ఉండటం నిరాశ కలిగించే మరో అంశం.

‘మోడ్రన్‌ మాస్టర్స్‌’లో తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తోన్న మెయిన్ కంప్లెయింట్ డబ్బింగ్. విజువల్ గా ఈ డాక్యుమెంటరీ బాగున్నా, డబ్బింగ్ విషయంలో మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. జేమ్స్ కామెరాన్, కరణ్ జోహార్ లాంటి ఒకరిద్దరు తప్ప, మిగతా వారందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. అయినప్పటికీ వారి ఒరిజినల్‌ వాయిస్‌ కాకుండా, వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. రాజమౌళి, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రానా వాయిస్ లు తెలుగు ప్రేక్షకులకు అలవాటు పడిపోయాయి. కానీ ఇక్కడ మన దర్శక హీరోల సొంత గొంతులు వినిపించకపోవడం అసంతృప్తిగా అనిపిస్తుంది. తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన ఇంగ్లీష్, హిందీ డాక్యుమెంటరీ చూస్తున్నామనే ఫీలింగ్ కలగక మానదు. ఓవరాల్ గా జక్కన్న మీద రూపొందించిన ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ మెజారిటీ వర్గాన్ని మెప్పిస్తుంది. తెలుగులో కాకుండా నేరుగా ఇంగ్లీష్ లో చూస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు.