Begin typing your search above and press return to search.

ముంబైకి రాజ‌మౌళి.. టాప్ సీక్రెట్ లీక్!

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌దుప‌రి మూవీ కోసం రాజ‌మౌళి పూర్తిగా వ‌ర్క్ మోడ్ లోకి వ‌చ్చేసారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:22 AM GMT
ముంబైకి రాజ‌మౌళి.. టాప్ సీక్రెట్ లీక్!
X

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఏం చేస్తున్నా అది ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్యూరియాసిటీ పెంచుతుంది. ఆయ‌న క‌ద‌లిక‌లు, ఆయ‌న మాటలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ అఖండ విజ‌యాన్ని అవార్డులతో జైత్ర‌యాత్ర‌ను ఆస్వాధించిన జ‌క్క‌న్న గ‌త ఏడాది అంతా బిజీబిజీగా గ‌డిపారు. అదే స‌మ‌యంలో మ‌హేష్ కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్క్రిప్టును రెడీ చేసారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌దుప‌రి మూవీ కోసం రాజ‌మౌళి పూర్తిగా వ‌ర్క్ మోడ్ లోకి వ‌చ్చేసారు.

రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు స‌హా ప్ర‌తిదీ వేగ‌వంతం చేసార‌ని తెలిసింది. ఒక విదేశీ న‌టి మ‌హేష్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని కూడా ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఇంత‌లోనే ఒక టాప్ సీక్రెట్ రివీలైంది. రాజమౌళి త్వరలో ముంబైకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు కొంద‌రు హిందీ నటీనటులను కలవనున్నట్టు సమాచారం. ఇది ఫారెస్ట్ యాక్షన్ డ్రామా కథాంశంతో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపుల‌ర్‌ తారలను ఇందులో నటింపజేయాలనుకుంటున్నారు. దానికోస‌మే ఇప్పుడు ముంబైకి వెళుతున్నార‌ని తెలిసింది.

అంతేకాదు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ను పాన్ ఇండియా స్టార్ గా కాకుండా, పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా హాలీవుడ్ హీరోల‌కు ధీటుగా ఎలివేట్ చేయాల‌నే ప్ర‌య‌త్నంలో రాజ‌మౌళి ఉన్నారు. మ‌హేష్ లుక్, ఛ‌రిష్మా ఏ హాలీవుడ్ స్టార్ కి త‌క్కువ కాదు. దానికి త‌గ్గ‌ట్టే యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థాంశాన్ని ఎంచుకుని అత‌డిని ప్ర‌పంచ స్థాయి స్టార్ గా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ పుర‌స్కారాలు ద‌క్కించుకోవ‌డ‌మే గాక రాజ‌మౌళికి ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు ద‌క్కింది. ఇప్పుడు జ‌క్క‌న్న ఏం చేసినా హాలీవుడ్ ప్ర‌ముఖుల్లోను అది చ‌ర్చగా మారుతుంది. అందుకే దీనిని ఎన్ క్యాష్ చేసుకునే అవ‌కాశం మ‌హేష్ కి క‌లుగనుంది. మ‌హేష్- రాజ‌మౌళి ఈ అసాధార‌ణ ప్ర‌య‌త్నానికి వెన‌కాడ‌టం లేద‌ని తెలిసింది. ఒక హాలీవుడ్ సినిమా త‌ర‌హాలోనే ప్ర‌పంచ స్థాయిలో మ‌హేష్ సినిమాని రిలీజ్ చేయాల‌న్న ప్ర‌ణాళిక‌లు ఉన్న‌ట్టు ఇటీవ‌ల మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఈ సినిమా కోసం బ‌డ్జెట్ కూడా అసాధార‌ణంగా ఉంటుంద‌ని కూడా లీకులు అందాయి.

ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా మ్యాకో లుక్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతున్న తన కొత్త చిత్రం `గుంటూరు కారం` ప్రమోషన్స్‌లో మ‌హేష్‌ బిజీగా ఉన్నారు. ఇది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12 న విడుదల కానుంది.