Begin typing your search above and press return to search.

'మోడరన్ మాస్టర్స్: SS రాజమౌళి' ట్రైలర్

ఒక తెలుగు ద‌ర్శ‌కుడు అయిన‌ రాజ‌మౌళి ప్ర‌జ్ఞ గురించి ఇంత‌కంటే ఇంకా ఇంకా ఏం చెప్పాలి?

By:  Tupaki Desk   |   22 July 2024 8:11 AM GMT
మోడరన్ మాస్టర్స్: SS రాజమౌళి ట్రైలర్
X

'RRR (2023) నాటు నాటు`కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా తెలుగు చిత్రం ఆస్కార్‌ను గెలుచుకోవడంతో భారతదేశం చరిత్ర సృష్టించింది. ఈగ, మగధీర, బాహుబలి ఫ్రాంచైజ్, RRR వంటి చిత్రాలతో SS రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇండియా, అమెరికా, బ్రిటిన్, ఆస్ట్రేలియా, జ‌పాన్, చైనా, కొరియా, యూరోప్ స‌హా చాలా దేశాల్లో ఇప్పుడు రాజ‌మౌళి పేరు ఫేమస్. ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలే ఆయ‌న్ను ప్ర‌పంచానికి పరిచ‌యం చేసాయి. ఆస్కార్ కొల్ల‌గొట్టిన సినిమా సాక్షిగా రాజ‌మౌళి ఇప్పుడు హాలీవుడ్ కి కూడా సుప‌రిచితుడు. అక్క‌డ లెజెండ‌రీ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి ప‌నిత‌నాన్ని కొనియాడారు. గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల‌ను ఆర్.ఆర్.ఆర్ అందుకోవ‌డంతో రాజ‌మౌళి ఎవ‌రు? అన్న‌ది అక్క‌డ ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక తెలుగు ద‌ర్శ‌కుడు అయిన‌ రాజ‌మౌళి ప్ర‌జ్ఞ గురించి ఇంత‌కంటే ఇంకా ఇంకా ఏం చెప్పాలి?

అలాంటి గొప్ప దార్శ‌నికుడైన ద‌ర్శ‌కుడిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ `మోడరన్ మాస్టర్స్: SS రాజమౌళి` పేరుతో ఆగస్టు 2న ప్రదర్శితం కానుంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్- ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ నిర్మించిన డాక్యుమెంట‌రీ ఇది. సినీ విమర్శకులు, పాత్రికేయురాలు అనుపమ చోప్రా హోస్ట్ చేసిన ఈ డాక్యుమెంటరీ భారతదేశం నుండి అంతర్జాతీయ స్థాయికి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్రయాణాన్ని ఆవిష్క‌రిస్తుంది.

మోడరన్ మాస్టర్స్: SS రాజమౌళి ట్రైలర్ తాజాగా విడుద‌లైంది. డాక్యుమెంటరీ మొదటి ట్రైలర్ RRRని ప్రమోట్ చేస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్ర‌యాణించిన రాజ‌మౌళి జ‌ర్నీని చూపిస్తూ.. అతడితో ప‌ని చేసిన స్టార్లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి వంటి వారి అభిప్రాయాల‌తో నిండి ఉంది. దర్శకుడు రాజ‌మౌళి గురించి, అతడిలోని ద‌ర్శ‌క‌త్వ నైపుణ్యం, లక్షణాల గురించి అతడి దూర‌ దృష్టి గురించి వీరంతా మాట్లాడారు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్, బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ కూడా రాజ‌మౌళి ప‌ని తీరును ప్ర‌శంసిస్తూ వ్యాఖ్యానించిన విజువ‌ల్స్ ని కూడా ఇందులో చూపించారు. నేను నా క‌థ‌కు బానిస‌ను అంటూ రాజ‌మౌళి చెప్పిన ముగింపు వాక్యం హృద‌యాల‌ను తాకుతుంది.

ఓ ప్ర‌క‌ట‌న‌లో రాజమౌళి ఈ డాక్యుమెంటరీ గురించి మాట్లాడుతూ-``కథ చెప్పడం నా హృద‌యాన్ని ఆవిష్క‌రించ‌డ‌మే. ఇది నేను మక్కువతో ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటాను. ప్రేక్షకులు నా పనిపై చూపుతున్న అపారమైన అభిమానం, ప్రేమకు నేను ఉప్పొంగిపోతాను. నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిలిం కంపానియన్ స్టూడియోలు కలిసి నా కథను ప్ర‌జ‌ల‌కు చేర్చ‌డం నిజంగా ఆశీర్వాదం. ఈ డాక్యుమెంట‌రీ చిత్రం నా ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్నందుకు నా అభిమానులకు, ఆప్తులు ప్రియమైనవారికి కృతజ్ఞతలు తెలియజేయ‌డంగా భావిస్తాను. సృజించ‌డం, వినోదం పొందడం కొనసాగించండి`` అని వ్యాఖ్యానించారు.