రాజా సాబ్.. ఈ లిస్టులో చేరుతాడా?
అందుకే మన దర్శక రచయితలు హార్రర్ కు కామెడీ జోడించి, ఓవైపు కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు థ్రిల్ ను పంచుతున్నారు.
By: Tupaki Desk | 19 Oct 2024 11:30 AM GMTహారర్ కామెడీ అనేది ఇండియన్ సినిమాలో ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. కేవలం హారర్ అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. అందుకే మన దర్శక రచయితలు హార్రర్ కు కామెడీ జోడించి, ఓవైపు కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు థ్రిల్ ను పంచుతున్నారు. మిగతా జోనర్స్ తో పోల్చుకుంటే ఈ చిత్రాలకు పెట్టుబడి కూడా చాలా తక్కువే. క్లిక్ అయితే మాత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురుస్తుంది. నిర్మాతల జేబుల్లోకి అధిక మొత్తంలో ప్రాఫిట్స్ వచ్చి చేరుతాయి. అందుకే మన ఫిలిం మేకర్స్ ఈ జానర్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మళ్ళీ హార్రర్ కామెడీ చిత్రాల ట్రెండ్ ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. శ్రద్ధా కపూర్, రాజ్ కపూర్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'స్త్రీ 2' సినిమాని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే, ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2024లో అత్యధిక కలెక్షన్లు అందుకున్న రెండవ భారతీయ చిత్రంగా, అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
అలానే రూ.30 కోట్లతో రూపొందించిన 'ముంజ్యా' మూవీ.. రూ.130 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. ఇదే క్రమంలో ఆడియన్స్ ను నవ్విస్తూ భయపెట్టడానికి మరికొన్ని రోజుల్లో 'భూల్ భూలయ్యా 3' చిత్రం వస్తోంది. ఇది బ్లాక్ బస్టర్ 'భూల్ భూలయ్యా 2' చిత్రానికి సీక్వెల్. ఇందులో కార్తీక్ ఆర్యన్, త్రిప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమా కూడా ఇదే జోనర్ లో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ది రాజా సాబ్". పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో TG విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ హారర్ కామెడీ అని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో హారర్ కామెడీలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి కాబట్టి, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
సౌత్ లో హారర్ కామెడీ సినిమాలు అనగానే ఎవరికైనా 'ముని' ప్రాంచైజీ గుర్తొస్తుంది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ముని' 'ముని 2 - కాంచన' 'కాంచన 2' 'కాంచన 3' సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి', ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' వంటి మరికొన్ని చిత్రాలు విజయం సాధించాయి. మారుతీ గతంలో తీసిన 'ప్రేమ కథా చిత్రమ్' సినిమా కూడా సూపర్ హిట్టైంది. ఈ క్రమంలో ప్రభాస్ తో రూపొందిస్తున్న 'ది రాజా సాబ్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.