Begin typing your search above and press return to search.

'మా అమ్మ మళ్ళీ చనిపోయింది'.. కన్నీళ్లు తెప్పిస్తున్న రాజేంద్రప్రసాద్ వీడియో

రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ గా మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 10:44 AM GMT
మా అమ్మ మళ్ళీ చనిపోయింది.. కన్నీళ్లు తెప్పిస్తున్న రాజేంద్రప్రసాద్ వీడియో
X

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కూతురి అకాల మరణంతో విషాదంలో మునిగిపోయిన రాజేంద్ర ప్రసాద్ ని సినీ ప్రముఖులంతా ఓదార్చారు. గాయత్రి అంత్యక్రియలు కూకట్ పల్లి కైలాసవాసంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మా అమ్మ మళ్లీ చచ్చిపోయిందంటూ కన్నీరు మున్నీరయ్యారు.

"మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది. మా అమ్మని పంపించేసి వస్తాను. మనం చేయగలింది ఏమీ లేదు. మన చేతుల్లో ఏమీ లేదు. నేను జీవితంలో ఏం సంపాదించలేదు. సాధించలేదు. బెజవాడ గాయత్రి కాంప్లెక్స్ వుంది అంతే" అంటూ రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. అలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు నటులు ఆయన్ను ఓదార్చారు. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ గా మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజేంద్ర‌ ప్ర‌సాద్‌ కు ఒక కొడుకు, కూతురు. ఏకైక కుమార్తె గాయత్రి చిన్న వ‌య‌సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. 2018లో ఆయన నటించిన ‘బేవర్స్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో కూతురి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు రాజేంద్రప్రసాద్‌. తన 10వ ఏట తల్లిని కోల్పోయానని, తన జీవితమంతా అమ్మ లేని లోటు వెంటాడుతూ ఉండేదని అన్నారు. కానీ గాయత్రి పుట్టిన తర్వాత తనలోనే తల్లిని చూసుకున్నానన్నారు. అయితే అప్పుడు తనకు తన కూతురికి మాటలు లేవని చెప్పారు. తన అంగీకారం లేకుండానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని, అప్పటి నుంచి తనతో మాట్లాడటం మానేశానని తెలిపారు.

"బేవర్స్ సినిమా కోసం సుద్దాల అశోక్‌ తేజ రాసిన ‘తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా.. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా’ పాట విన్నాను. విన్న వెంటనే నా కళ్ల నిండా కన్నీళ్లొచ్చాయి. ఆ రోజు సాయంత్రం నా కూతురిని ఇంటికి పిలిపించి ఈ పాటను నాలుగు సార్లు తనకి వినిపించాను. ఆ పాట విన్నాక నా కూతురిపై కోపం పోయింది. అమ్మ చనిపోయినప్పుడు ఎలా అయితే ఏడ్చానో అలా ఏడ్చేశాను" అంటూ రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్ అయ్యారు.

కూతురిలోనే తల్లిని చూసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే గాయత్రికి ఓ ఇంటిని, ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారు. గాయత్రి ఒక న్యూట్రీషియనిస్ట్. కేపిహెచ్‌బీలో తన భర్త రాజ్‌ కుమార్‌, కూతురు సాయి తేజస్వినితో ఉండేవారు. గత శుక్రవారం రాత్రి గాయత్రికి ఛాతీలో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమె చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.

ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయితేజస్విని ‘మహానటి’ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసింది. చిన్ననాటి సావిత్రి పాత్రలో మంచి నటన కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత మరో మూడు చిత్రాల్లో నటించింది. మరోవైపు రాజేంద్ర ప్రసాద్ క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఏదేమైనా త‌న కామెడీతో అంద‌రినీ న‌వ్వించిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌ కు ఒక్కగానొక్క కుమార్తె దూరం కావ‌డం అందరి మ‌న‌సుల్ని క‌లిచివేస్తోంది. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.