వివాదంలో భారతీయుడు-2..రిలీజ్ లోపు గట్టెక్కేనా?
వర్మక్కలైకి సంబంధించి కమల్ హాసన్ ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
By: Tupaki Desk | 30 Jun 2024 6:50 AM GMTఅప్పటి 'భారతీయుడు' అంత పెద్ద సక్సెస్ అయిందంటే? అవినీతి బ్యాక్ డ్రాప్ ఒక కారణ మైతే..అందులో యాక్షన్ సన్నివేశాల కోసం సేనాపతి వినియోగించిన వర్మక్కలై విద్య మరో కారణం అనడంలో సందేహం లేదు. ప్రత్యర్ధి ఎంతటి బలవంతుడైనా రెండు వేళ్లు నరాలపై మెలిపెట్టి తిప్పితే కుప్ప కూలిపోవాల్సిందే. సేనాపతిని స్టైలిష్ గా ఆవిష్కరించడంలో వర్మక్కలై కూడా కీరోల్ పోషించింది. వర్మక్కలైకి సంబంధించి కమల్ హాసన్ ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
1996 సమయంలో ఆ విద్యను రాజేంద్రన్ అనే వ్యక్తి నుంచి కమల్ నేర్చుకున్నారు. తాజాగా `భారతీయుడు-2` లో కూడా అదే విద్యను యాక్షన్ సన్నివేశాల్లో హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. వర్మక్కలై సినిమాలో ఉంటుందా? ఉండదా? అని మొన్నటివరకూ సందేహం ఉండేది. కానీ ట్రైలర్ రిలీజ్ లో ఆ కళనే ఓ రేంజ్ లో మరోసారి హైలైట్ చేసారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి.
ట్రైలర్ రిలీజ్ వరకూ అంతగా బజ్ లేదు గానీ, రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో భారతీయుడు-2 వివాదంలో పడింది. తాను నేర్పించిన విద్యకు సంబంధించి తన నుంచి ఎలాంటి రైట్స్ తీసుకోలేదని రాజేంద్రన్ మధురై జిల్లా న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసాడు. సినిమా రిలీజ్ పై స్టే విధించాలని కోరాడు. 1996 లో ఈ విద్యకి సంబంధించిన టెక్నిక్ ని చెప్పాను.
కొన్ని ఫైట్ సన్నివేశాలకు నా మేథస్సునే వినియోగించుకున్నారు. దీనిలో శాస్త్రీ పద్దతులను దర్శకుడు శంకర్ తో పాటు, రచయిత సుజాతకు అప్పట్లో వివరించాను. అప్పుడు భారతీయుడు సినిమా రిలీజ్ సమయంలో టైటిల్ కార్స్డ్ లో నా పేరు కూడా వేసారు. తాజాగా భారతీయడు-2 కోసం కూడ వర్మ విద్యని వాడుకున్నారు. కానీ ఎక్కడా నా పేరు గానీ, ఫలానా వ్యక్తి నుంచి స్పూర్తిగా తీసుకున్నాం అని గానీ వేయలేదు.
ఆ కళకు సంబంధించి పూర్తి హక్కులు నా దగ్గరే ఉన్నాయి. నా అనుమతి లేకుండా వాడటానికి వీలు లేదని పిటీషన్ లో దాఖలు చేసాడు. పిటీష పై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిర్మాత, దర్శకుడకు కాపీరైట్ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి తదుపరి విచారణ జులై 9కి వాయిదా వేసింది. కాగా సినిమా జులై 12న రిలీజ్ చేస్తున్నారు.