ప్రజలకు సామాజిక నీతి తెలియాలి.. అదే రజనీ స్టైల్
ఈ రెండు విషయాలను సమతుల్యం చేయడంలో రజనీ తర్వాతే అని నిరూపణ అయింది.
By: Tupaki Desk | 13 Oct 2024 10:39 AM GMTసూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్ ఆద్యంతం రెండు విషయాలను తూచ తప్పక ఆచరించారు. ఆయన కథల ఎంపికలు కచ్ఛితంగా ప్రామాణికమైనవని నిరూపణ అయింది. కేవలం డబ్బు సంపాదన కోసం ఏదో ఒక కమర్షియల్ కథను అంగీకరించడం వేరు. అలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆర్జిస్తూనే, ప్రజల కోసం చక్కని సామాజిక సందేశం ఉన్న కథను ఎంపిక చేయడం వేరు. ఈ రెండు విషయాలను సమతుల్యం చేయడంలో రజనీ తర్వాతే అని నిరూపణ అయింది.
రజనీకాంత్ నటించిన బాషా, శివాజీ- ది బాస్, అరుణాచలం, బాబా, రోబో .. ఇలా ఏ సినిమా చూసినా అందులో అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది. అలా ఉండాలని అతడి దర్శకులు ఆలోచించినా తాను స్వయంగా అంగీకరించాలి కదా? ఈ విషయంలో రజనీని నిజమైన బాస్ అని అంగీకరించాలి. ప్రజా శ్రేయస్సు కోసం అంతో ఇంతో తన సినిమాలో ఉండాలని ఆయన నిరూపించారు.
రజనీ నటించిన తాజా యాక్షన్ చిత్రం `వెట్టయన్-ది హంటర్`లో శక్తివంతమైన సందేశాన్ని అందించారు. TJ.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కమర్షియల్ ఎలిమెంట్స్ తో అలరించడమే కాదు...పదునైన సామాజిక సందేఆన్ని అందించింది. ఈ చిత్రం విద్యా వ్యవస్థలోని దోపిడీ స్వభావాన్ని వెలుగులోకి తెచ్చింది. కోచింగ్ సెంటర్ల పేరుతో దోపిడీని విద్యలో వ్యాపార ధృక్పథాన్ని నిలదీసిన చిత్రమిది. ఈ సినిమా కథనం నీట్ పోటీ పరీక్షల్లో కాపీ క్యాట్ వ్యవహారాన్ని, దాంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎదుర్కొంటున్న పోరాటాలను విశ్లేషించిన తీరు అమోఘం. విద్యా అవ్యవస్థ ఎలా ఉందో తెరపై చూపించడంలో రజనీ అతడి దర్శకుడు జైభీమ్ ఫేం జ్ఞానవేల్ లను ప్రశంసించకుండా ఉండలేం. నీట్ తో విద్యార్థుల సమస్యలు, అధిక రుసుములను వసూలు చేసే బైజుస్ వంటి ఆన్‌లైన్ వేదికల గురించి కూడా ఈ చిత్రంలో చర్చించారు. విద్యా అవ్యవస్థలో సంక్లిష్ఠతలను తెరపై ఆద్యంతం ప్రదర్శించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. రజనీకాంత్ లాంటి అతి పెద్ద సూపర్ స్టార్ ఇలాంటి విషయాలను తెరపై చెప్పడం అనేది సామాన్యులకు కూడా అర్థమయ్యేందుకు సహకరిస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటి సినిమాలను అరుదైన కేటగిరీలో చూడాల్సి ఉంటుంది.